Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాటాపూర్ దళితవాడలో ఇంటింటికీ కాంగ్రెస్
నవతెలంగాణ-తాడ్వాయి
దళితబంధు పేరుతో మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ కొత్త నాటకం మొదలు పెట్టారని కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాలపు అనంతరెడ్డి అన్నారు. మండలంలోని కాటాపూర్‌లో సోమవారం దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఎంపీటీసీ మేడిశెట్టి జయమ్మ ఆనందం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సోమయ్య, అనంతరెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ మాటలు వింటుంటే.. చెప్పేటోడికి వినేటోడు లోకువ అన్న సామెత గుర్తొస్తోందని ఎద్దేవా చేశారు. 'దళితబంధు స్కీమ్ నూరు శాతం అమలవుతుందా? రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి నగదు పంపిణీ చేసే చిత్తశుద్ధి కేసీఆర్‌కు ఉందా' అని ప్రశ్నించారు? 'కేసీఆర్ మాటలు కోటలు దాటుతూనే ఉన్నాయి. దళితబంధే కాదు అవసరమైతే బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేద బంధు అమలు చేస్తామని, ఇంకా 20 ఏండ్లు అధికారంలో ఉంటా'మంటూ కేసీఆర్ పార్టీ మీటింగ్‌లో ఊదరగొట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో దళితులను వంచించిందెవరు? తొలి రోజు నుంచే ఎస్సీలను మోసం చేసిందెవరు? దళితుల అభివద్ధి సంక్షేమం అంటూనే ఇచ్చిన మాట తప్పిందెవరు? ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకిందన్నట్లుగా కేసీఆర్ ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. దళితబంధుకు సరిపడేంత ఆమ్దానీ రాష్ట్రానికి ఉందా? అనే విషయాన్ని దాచిపెట్టి మిగతా వర్గాల అసంతప్తిని చల్లార్చేందుకు కేసీఆర్ గొప్పలకు పోతున్నారన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 1.10 కోట్ల కుటుంబాలున్నాయని, ఇప్పటికే ఈ సంఖ్య 1.30 కోట్లకుపైగా చేరుకుందని, ఒక్క దళిత బంధుకే రూ.1.70 లక్షల కోట్లు అవసరమైతే రాష్ట్రంలో బీసీ బంధు, మైనారిటీ బంధు, అగ్రవర్ణాల్లోని పేదల బంధు కూడా అమలు చేయాలంటే దాదాపు రూ.13 లక్షల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు, భూములు అన్నీ అమ్మేసినా అంత భారీగా నిధులు సమకూర్చటం అసాధ్యమే అని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఏడేండ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. హుజూరాబాద్ బై ఎలక్షన్ వల్ల కేసీఆర్‌కు ఎస్సీలు గుర్తుకు రావటం సంతోషించదగ్గ పరిణామమని చెప్పారు. రాష్ట్రంలో దళితులు అట్టడుగున ఉన్నారని, అభివద్ధికి దూరంగా కునారిల్లుతున్నాయని ఆయనకు ఏడేండ్ల తర్వాత తెలిసొచ్చిందా అని మండిపడ్డారు. తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచే దళితులను దగా చేయటం మొదలుపెట్టారని విమర్శించారు. సీఎం పదవిని దళితులకు ఇవ్వకుండా కల్వకుంట్ల ఫ్యామిలీ గుత్తాధిపత్యం మొదలుపెట్టారు. కొత్త రాష్ట్రంలో దళితులను మోసం చేసిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్? చరిత్రలో నిలిచిపోయారని, ఫస్ట్ టర్మ్‌లో డిప్యూటీ సీఎం పదవిని దళితుడికి కట్టబెట్టిన కేసీఆర్, మూడేండ్లు తిరక్కముందే ఆయనకు ఉద్వాసన పలికారు.
దళితబంధు టెంపరరీ ప్లాన్
దళితబంధు స్కీమ్ మంచిదే. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చి ఆర్థికంగా చేయాతను అందించే ఆలోచన కూడా గొప్పదే. కానీ.. కేసీఆర్ ఇచ్చే టైమ్ పాస్ హామీలపైనే అందరికీ డౌట్ అని, పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌లో 21 వేల దళిత కుటుంబాలకు దళితబంధు అమలు చేయాలనేది కేసీఆర్ టెంపరరీ ప్లాన్. అందుకే నెల రోజుల్లోనే ఆగమాగం రూ.2 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందని తెలిపారు. మొత్తం డబ్బులిస్తాం, ఏదైనా.. ఎక్కడైనా వ్యాపారం, స్వయం ఉపాధి యూనిట్లు పెట్టుకోవచ్చని కేసీఆర్ చెబుతుంటే.. వినటానికి బాగానే ఉంది. ఎస్సీ కుటుంబాల్లో ఆశలు రేకెత్తిస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ సీఎం మీటింగ్‌లో చెక్కులు అందుకున్న 15 మందికి తప్ప మిగతా ఎస్సీ కుటుంబాల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని అన్నారు. ఇప్పటికీ స్కీమ్ అమలుపై ప్రభుత్వానికి ఒక స్పష్టత లేకపోవటం అతి పెద్ద లోపం అని, అసలు గైడ్‌లైన్స్ లేకుండా లాంచ్ చేసిన మొట్టమొదటి స్కీమ్? ఇదే అని తెలిపారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే మోసపూరిత వాగ్దానాలకు బలి కాకూడదని మోస పోకూడదని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ పులి సంపత్ గౌడ్, వైస్ చైర్మెన్ ఇందారపు లాలయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అర్రెం లచ్చు పటేల్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు వావిలాల రాంబాబు, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి పీరీల వెంకన్న, పీఏసీఎస్ డైరెక్టర్లు యానాల సిద్దిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిరి లక్ష్మీనర్సయ్య, ముజఫర్ హుస్సేన్, పాలకుర్తి రవీందర్, పులి రవి, మద్దూరి రాజు, తోట సత్యం, ఆనందం, పల్నాటి సత్యం, దాయ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.