Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-భూపాలపల్లి
రహదారి ప్రమాదాలు జరగకుండా రోడ్ల మరమ్మ తులు పూర్తి చేసి ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి రహదారుల భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రహదారుల పరిస్థితి, జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదాలపై నేషనల్ హైవే, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజినీర్లు, రవాణా, పోలీస్ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రతి రోజు దాదాపు 6వేల వాహనాలు రాకపోకలుసాగిస్తుంటాయని వర్షాకాలం రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టా లన్నారు. పరకాల నుండి కాలేశ్వరం వరకు జాతీయ రహదారిపై దాదాపు 200 గుంతలు ఏర్పడ్డాయని, రెండు నెలల్లో సుమారు 20 మరణాలు సంభవిం చాయన్నారు. గతంలో జాతీయ రహదారి పొడవునా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని, గుంతలను పూడ్చాలని ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేపటిలోగా అన్ని గుంతలను పూడ్చి వేసి వారంలోగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను సూచిస్తూ సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆర్ అండ్ బి రోడ్ నుండి నేషనల్ హైవే రోడ్ లోకి వెళ్లే వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. కాళేశ్వరం-మహాదేవపూర్ మధ్య, భూపాలపల్లి పట్టణం-చెల్పూర్ మధ్య రహదారి అధ్వానంగా ఉందని వెంటనే గుంతలను పూడ్చాలని నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యాసాగర్‌ను ఆదేశించారు. భూపాలపల్లి పట్టణం-చెల్పూర్ వరకు ప్రమాద హెచ్చరిక బోరులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌ను ఆదేశించారు. అధిక వర్షాలతో పలిమెల, మహాముత్తారం, టేకుమట్ల, మొగుళ్లపల్లి తదితర మండలాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల వ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులు, వంతెనలను గుర్తించి మరమ్మతు పనులను చేపట్టాలని ఆదేశించారు. మేడారం జాతర సమీపిస్తున్నందున మేడారానికి అనుసంధానమైన అన్ని శాఖల రహదారులను మరమ్మతులు చేసి సిద్ధం చేయాలన్నారు. రెండు జిల్లాలలో వివిధ ప్రాంతాల్లో అవసరమైన బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. భూపాలపల్లి పట్టణ పరిధిలో మైలారం, కాటారంలో ప్రత్యేకంగా వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని జిల్లా రవాణా శాఖ అధికారి వేణును ఆదేశించారు. ఆర్టీసీ బస్సులను ప్రజలకు ఇబ్బంది కలగకుండా రెండు జిల్లాల లోని మారుమూల ప్రాంతాలకు కూడా నడిపించాలని, బస్టాండ్ లలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ఆర్టీసీ డీఎం ధరమ్‌సింగ్‌ను ఆదేశించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అన్ని వసతులను కల్పించాలని, రహదా రుల వెంబడి అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని అన్నారు. మరుగుదొడ్ల తో కూడిన వాహనాల పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా రవాణాశాఖ అధికారి వేణు, ఆర్అండ్బీ ఈఈ వెంకటేష్, నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విద్యాసాగర్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, పంచాయతీ రాజ్ డీఈ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో మహేష్ బాబు, ఆర్టీసీ డిపో మేనేజర్ ధరమ్ సింగ్, ఎంవీఐ సంధాని మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.