Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధులు సభ దష్టికి తీసుకొని రాగా అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. వివిధ శాఖల పై జరిగిన చర్చలలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని, అధికారులు తమ బాధ్యతలను గుర్తించి బాధ్యతగా పనిచేయాలని ఒక దశలో హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథులుగా జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి తో పాటు ఎమ్మెల్యే హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శి మూడు నెలలుగా విధులకు రావడంలేదని, అటెండెన్స్ రిజిస్టర్ లేదని, పని వేళలపై సర్క్యులర్ తమకు ఇవ్వాలని పెద్దకొడపాక సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి సభ దష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కార్యదర్శులు ఎనిమిది గంటలపాటు పని చేయాలని, ఉదయం 8 గంటల నుండి మల్టీపర్పస్ వర్గాలతో పనులు చేయించాలని, కార్యదర్శులు పని చేయకపోతే సస్పెండ్ చేయండి అని ఎంపీఓ రంజిత్ కుమార్‌ను ఆదేశించారు. పశు వైద్యశాలకు వెళ్లే దారి ఏర్పాటు చేయాలని, ఆస్పత్రికి ఎదురుగా మద్యం షాపు ఉండడంతో మందుబాబులు రోడ్లపై మందు తాగుతుండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని పశువైద్యాధికారి సభ దష్టికి తీసుకొచ్చారు. పోలీసులు పెట్రోలింగ్ చేసి రోడ్డుపై తాగితే కేసు నమోదు చేయాలని పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఇన్చార్జి వెటర్నరీ డాక్టర్ ను కాకుండా రెగ్యులర్ డాక్టర్ ను నియమించాలని సర్పంచులు కోరారు. పశు వైద్యశాల రోడ్డు తొలగించడంపై పీఏసీఎస్ చైర్మెన్‌పై సర్పంచి రవి ప్రశ్నల వర్షం కురిపించడంతో స్పందించిన ఎమ్మెల్యే పశు వైద్య శాల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమి సమగ్ర సర్వే చేపట్టి చుట్టూ ఫెన్సింగ్ వేయించాలని, నిధులు తాను మంజూరు చేస్తానని తహసీల్దార్‌ను ఆదేశించారు. రోడ్డు నిర్మాణం లేకుండా ఇంటికి పర్మిషన్ ఎలా ఇచ్చారని ఎంపీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పైపుల ద్వారా మురికి నీరు వస్తుందని, అడుగడుగునా లీకేజీలు ఏర్పడుతున్నాయని, పైపులు వేసినా నల్లాలు బిగించలేదని, కొన్ని గ్రామాల్లోకి నీరు రావడం లేదని సర్పంచులు, ఎంపీటీసీలు సభ దష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల సమక్షంలో అతి త్వరలో గోవిందాపూర్ గ్రామం నుండి మిషన్ భగీరథ పై క్షేత్రస్థాయి సర్వే చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. చెరువులు ఎంత విస్తీర్ణం ఉండాలి, ఎంత భూమి అన్యాక్రాంతం అయిందని గుర్తించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం డబ్బులు చెల్లింపుల్లో తక్కువ డబ్బులు జమ అయ్యాయని, ఈ విషయాన్ని ఐకేపీ అధికారుల దష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని, సీసీని ట్రాన్స్ఫర్ చేయాలని, రైతులకు క్షమాపణ చెప్పాలని ఎంపీటీసీ చంద్రప్రకాష్ తెలిపారు. వైన్ షాపులు సమయం కంటే ముందు మూసి వేస్తున్నారని, ఎమ్మార్పీ రేట్ కంటే అధిక ధరలు వసూలు చేస్తూ, బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సభ దష్టికి తీసుకువచ్చారు. బెల్టుషాపులపై దాడులు చేసి కేసు నమోదు చేయాలని, ఎమ్మార్పీ ధరకే మద్యం అమ్మేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సీఐని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. సర్పంచ్‌లు పోటీ తత్వంతో గ్రామ సమగ్ర అభివద్ధి కోసం పని చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ప్రొబెషనరీ పీరియడ్‌లో ఉన్నారని, అధికారులు వారితో సక్రమంగా పని చేయించాలని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్‌తోనే కరోనా తగ్గుముఖం పట్టిందని, ఈ నెలాఖరు వరకు ప్రతి గ్రామంలో శిబిరం ఏర్పాటు చేసి 18 ఏండ్లకుపైబడ్డ అందరికీ వ్యాక్సిన్ అందజేస్తూ 95 శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అన్నారు. నవీనయుగంలో పంట భూముల కనుగుణంగా పంట సాగు చేసేలా రైతులను చైతన్యవంతులను చేయాలని, పంట మార్పిడి చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో మండల సమగ్ర అభివద్ధి కోసం పని చేయాలని ఆదేశించారు. మండల సభలో గ్రామ సమస్యలను సభ దష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. సభకు హాజరు కాని అధికారులకు నోటీసులు జారీ చేయాలన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ రామిశెట్టి లత లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కుసుమ శరత్, తహసిల్దార్ హరికష్ణ, ఎంపీడీఓ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.