Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలో కరోనా నిరోధక వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్ ఒకటే. కానీ వ్యాక్సినేషన్‌పై ఇప్పటికే అనేక అపోహలున్నాయి. పట్టణాలు, నగరాల్లోనూ అనుమానాలకు మినహాయింపు కాదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ అంటేనే వద్దు బాబోరు అంటున్నారు. ఇదిలా జిల్లా కలెక్టర్ కష్ణ అదిత్య, జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య ఆదేశాల మేరకు మండలంలో తహసీల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్, ఎంపీడీఓ సత్య ఆంజనేయ ప్రసాద్, పీహెచ్సీ వైద్యాధికారి అవినాష్ మండలంలోని మారుమూల గ్రామాల్లో కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం నిర్వహించారు. మండల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, మలేరియా వర్కర్లు, హెల్త్ సూపర్వైజర్లు నిరంతరం కషి చేసి తాడువాయి ఏజెన్సీలోని ఎక్కువ గ్రామాల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసి రికార్డుకెక్కారు. ఈ అరుదైన ఘనత సాధించిన చరిత్ర తాడ్వాయి మండలంలోని కామారం (పిఎ), తాడ్వాయి, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, లవ్వాల, మొట్లగూడెం, మొండ్యాలతోగు, గంగారం జీపీ, కౌశెట్టివాయి, అన్నారం, బీరెల్లి, ఎల్లాపూర్, నర్సాపూర్ (పీఏ) పంబాపూర్, బంజర ఎల్లాపూర్, నాంపల్లి గ్రామాల సొంతమని చెప్పక తప్పదు. ఆ గ్రామాల్లో వ్యాక్సినేషన్ నూరు శాతం పూర్తి చేశారు. మండల పీహెచ్సీ పరిధిలోని తాడ్వాయి ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో 97%, మేడారం ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో 98%, రంగాపూర్ ఉప కేంద్రం పరిధిలో 92 శాతం, కాటాపూర్ ఉపకేంద్రం పరిధిలో 99.5 శాతం, గంగారం ఉపకేంద్రంలో నూరు, బీరెల్లి ఉపకేంద్రంలో నూరు శాతం వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ విజయవంతంగా పూర్తి చేశారు. మండలంలోని 18 ఏండ్లకుపైబడ్డ ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. మండల కేంద్రానికి కిలోమీటర్లు దూరంలోని గ్రామాలకు వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యాలు కూడా లేవు. కొన్ని గొత్తికోయ గ్రామాలకు చేరాలంటే ఏకంగా కిలోమీటర్లు దూరం నడవాల్సిన దుస్థితి నెలకొంది. అయినా ఆరోగ్య సిబ్బంది కృషి ఫలితంగా నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. మారుమూల ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు వ్యాక్సినేషన్‌పై సరైన అవగాహన లేకపోయినా వైద్యాధికారులు, సిబ్బంది కృషితో పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం 18 ఏండ్లలోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాని సంగతి తెలిసిందే.