Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ
సభ్యుడు సూడి కృష్ణారెడ్డి
నవతెలంగాణ-ఏటూరునాగారం
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జ్ఞానం వాసు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని తరగతుల ప్రజలకు నష్టం చేసేలా అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. పోడు భూములకు హక్కు పత్రాలు, తదితర అనేక హామీలు గుప్పించి ఓట్లు దండుకున్న పాలకులు తదనంతరం విస్మరించారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని మండిపడ్డారు. పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కి మూడు రైతు వ్యతిరేక చట్టాలు చేసిందని, కార్మిక సవరణలను సవరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి అవగాహన కల్పించి చైతన్యవంతం చేసి సమరశీల పోరాటాలు నిర్మించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 5న తలపెట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పోడు భూములకు పట్టాలివ్వకపోతే పతనం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మయ్య, దావూద్ అంజద్ బాషా, రత్నం రాజేందర్, పొదిల చిట్టిబాబు, వంక రాములు తదితరులు పాల్గొన్నారు.