Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
నిబంధనలకు విరుద్ధంగా విద్యాశాఖలో ఇచ్చిన ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు ప్రాథమిక విద్యకు గండంగా మారాయి. ప్రభుత్వం కొత్తగా చేసిన ఉపాధ్యాయుల సర్దుబాటు విధానం వల్ల గ్రామీణ పేద విద్యార్థుల పాఠశాలలకు ప్రమాదం ఏర్పడింది. అరకొరగా ఉన్న ఉపాధ్యాయులను హైస్కూల్లో భర్తీ కోసం మహబూబాబాద్ డీఈఓ చేపట్టిన డిప్యూటేషన్లలో ప్రక్రియ ఉపాధ్యాయులను తీవ్ర అసంతప్తికి గురి చేయగా ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహానికి కారణమైంది. అనాలోచిత డిప్యూటేషన్ల పాలన ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. మహబూబాబాద్ జిల్లా గిరిజనులకు పెట్టని కోటగా ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులు అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ హాస్టల్లో వసతి గహాలు తెరుచుకోలేదు. ఈ క్రమంలో గ్రామీణ పాఠశాలలు తండాల్లో ఉండే విద్యార్థులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసించేందుకు సమాయత్తమవుతున్నారు. కోవిడ్ కాలానికి ముందు నాటి విద్యార్థుల సంఖ్యను మాత్రమే పరిగణలోకి తీసుకొని ప్రస్తుత విద్యార్థుల సంఖ్యను విస్మరించి డీఈఓ చేపట్టిన డిప్యూటేషన్ల వల్ల గ్రామీణ పాఠశాలలు మూసివేసే పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా సుమారు 200ల మందికిపైగా ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఇచ్చారు. ఈ డిప్యూటేషన్లు అంతర్ మండల వారీగా కాకుండా జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్ వేశారు. ఈ పరిస్థితి ఉపాధ్యాయులకు తీవ్ర మనోవేదన మిగిల్చిందని చెప్పక తప్పదు. ప్రాథమిక స్థాయిలోని పాఠశాలలు మూతపడితే అవి భవిష్యత్తులో తెరుచుకోవడం సాధ్యం కాదన్నది జగమెరిగిన సత్యమే. అదే జరిగితే రాబోయే కాలంలో ప్రాథమికోన్నత, హైస్కూల్ స్థాయిలో పాఠశాలలో విద్యార్థులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. క్రమంగా ప్రభుత్వ విద్యకు మంగళం పాడే పరిస్థితి కనపడుతోంది. ప్రభుత్వ విద్యారంగం మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారనుంది. పేద విద్యార్థులకు ప్రయివేట్, కార్పొరేట్ స్థాయిలో వేలు, లక్షల రూపాయలు చెల్లించి విద్యను కొనుగోలు చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇలా జరిగితే భావిభారత బాల్యం బాలకార్మిక రంగం వైపు పోయే పరిస్థితి లేకపోలేదు.
జిల్లాలో 872 పాఠశాలలు
మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూల్ స్థాయిలో, ప్రభుత్వ, యాజమాన్య పరిధిలో మొత్తం 872 పాఠశాలలున్నాయి. ఇందులో సుమారు 3 వేల 307 ఉపాధ్యాయ పోస్టులున్నాయి. ఇందులో సుమారు 650 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం సుమారు 2700 మంది ఉపాధ్యాయులు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో హైస్కూళ్లలో, ఇతర ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం కోసం చేసిన డిప్యూటేషన్ సక్రమంగా లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్న పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులను తొలగించి సుదూర ప్రాంతాలకు డిప్యుటేషన్ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. డిప్యుటేషన్లలోనూ అక్రమాలు జరిగాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కురవి మండలంలోని లచ్చిరాం తండా ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. అందులో ఒక ఉపాధ్యాయురాలిని డోర్నకల్ మండలంలోని మన్నెగూడెం ప్రాథమిక పాఠశాలకు డిప్యూటేషన్ వేయడం విమర్శలకు ఆజ్యం పోసింది. అక్కడ ఉన్న ఒకే ఒక ఉపాధ్యాయురాలు సెలవు పెట్టిన, మీటింగ్‌కు హాజరైన, పాఠశాలకు రాకపోయినా పాఠశాల మూతపడే పరిస్థితి నెలకొంది. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదం పొంచి ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మూతపడ్డ పాఠశాలలు
ఉపాధ్యాయులకు డిప్యుటేషన్ ఇవ్వడం వల్ల మహబూబాబాద్ మండలంలోని మల్యాల గ్రామ శివారు కంబాలబండ తండా ప్రాథమిక పాఠశాల మూతపడింది. అందులో ఇద్దరు ఉపాధ్యాయులుండగా ఇద్దరినీ ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్ పంపారు. రెండేండ్లుగా అక్కడ పాఠశాల మూసి ఉంటుండడంతో సుమారు 50 మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ప్రయివేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. అలాగే హాస్టల్ లేక ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాల తెరవాలని, ఉపాధ్యాయులను నియమించాలని కోరినా స్పందన లేదు. మహబూబాబాద్ మండలంలోని రంగసాయిపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఏడాది క్రితం మూసేశారు. అక్కడ ఉన్న ఒక్క ఉపాధ్యాయుడిని వేరే పాఠశాలకు డిప్యుటేషన్ చేశారు. దీంతో అక్కడ ఉన్న సుమారు 50 మంది విద్యార్థులు సుదూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లడనికి ఇబ్బంది పడుతున్నారు. మహబూబాబాద్ మండలంలోని ఇస్లావత్ తండా ప్రాథమిక పాఠశాల కూడా మూతపడగా 30 మంది విద్యార్థులు దూర ప్రాంతంలో ఉన్న హైస్కూల్‌కు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగినా నిర్లక్ష్యం
ప్రస్తుత విద్యా సంవత్సరంలో కరోనా నేపథ్యంలో విద్యార్థులు లక్షలాది రూపా యల ఫీజులు చెల్లించలేని దుస్థితిలో సుదూర ప్రాంతాల్లోని కార్పొరేట్, ప్రయివేట్ పాఠ శాలలకు వెళ్లలేక స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో చేరుతున్నారు. ప్రసుత్త విద్యా సంవత్స రంలో జిల్లావ్యాప్తంగా సుమారు 25 శాతం విద్యార్థుల సంఖ్య పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇదేమి పట్టించుకోకుండా విద్యాశాఖ గతేడాది పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయుల డిప్యూటేషన్ చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. మహబూబాబాద్ పట్టణంలోని వేల్పుల సత్యనగర్ పాఠశాలలో 75 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, నలుగురు ఉపాధ్యాయుల్లో ఒకరిని వేరే పాఠశాలకు డిప్యుటేషన్ పంపారు. ఇప్పుడు అక్కడ మరో 15 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. ఇక్కడ పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
డిప్యుటేషన్లపై మళ్లీ పరిశీలించాలి
యాకూబ్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
జిల్లాలో విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంఈఓల, ఉపాధ్యాయులు సర్వే ఆధారంగా తనిఖీలు చేసి విద్యార్థుల సంఖ్యను నమోదు చేసి శాస్త్రీయంగా డిప్యుటేషన్ చేపట్టాలి. అలాగే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాలి. విద్యావాలంటీర్లను నియమించాలి. అలాగే ఉపాధ్యాయుల భర్తీకి పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేయాలి.