Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వెతలు
నవతెలంగాణ-చిన్నగూడూరు
అది ప్రభుత్వ పాఠశాల. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 130 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, విద్యాశాఖ నిబంధనల ప్రకారం ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంతోపాటు ఆరుగురు ఉపాధ్యాయులు, స్వీపర్, ఇతర ఉద్యోగులుండాలి. కాగా ఒకే ఉపాధ్యాయుడితో కాలం వెళ్లదీస్తున్నారు. మహబూబాబాద్ మండలంలోని జయ్యారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనిదీ దుస్థితి. విద్యార్థులు చదువుల్లో వెనుకబడుతున్నారని, సదరు ఒకే ఉపాధ్యాయుడు సైతం ఒత్తిడికి గురౌతున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 'నవతెలంగాణ' కథనం..
చిన్నగూడూరు మండలంలోని జయ్యారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యాబోధన అందుతుండేది. కరోనా నేపథ్యంలో సుమారు 18 నెలలు పాఠశాలలు మూతపడగా ఈనెలలో పాఠశాలలు తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు సాధిక్ పాషా మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నాడు. పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 130 మంది విద్యార్థులుండగా ప్రతిరోజూ 80 నుంచి 90 మందికి తగ్గకుండా విద్యార్థులు హాజరౌతున్నారు. కోవిడ్ నిబంధనలు మేరకు ప్రతిరోజూ పాఠశాలను శానిటైజ్ చేసి పరిసరాలను శుభ్రంగా ఉంచాల్సి ఉంది. కాగా స్కావెంజర్ లేక పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా తయారైంది. ఉపాధ్యాయుడు ఒక్కడే ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 నిమిషాల వరకు పాఠశాల పరిశుభ్రతతోపాటు విద్యార్థులకు విద్యాబోధన అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండాలి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠశాలను నడిపించడానికి ఒక ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడుతోపాటు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాలి. అలాగే స్కావెంజర్, స్వీపర్ ఉండాలి. ఈ క్రమంలో ప్రస్తుతం పాఠశాల మొత్తానికి ఒకే ఒక ఉపాధ్యాయుడు సాద్విక్ పాషా ఉండడంతో పాఠశాల అవసరాల కోసం మండల కార్యాలయానికి కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆయన మండల కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చినా, అనారోగ్యంతో సెలవు పెట్టినా విద్యార్థులకు బోధించే, పాఠశాలను చూసుకునే వారే లేని దయనీయ స్థితి కనపడుతోంది. ఎంఈఓ సైతం పని భారంతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఏడు మండలాలకు ఇన్ఛార్జిగా ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో ఆయన ఏ రోజు ఏ మండలంలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. సెలవు కోసం నోడల్ అధికారి ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సమాచారం అందించిన స్పందించకపోవడంతో ఎవరికి తెలియజేయాలో తెలియని పరిస్థితిలో ఉపాధ్యాయుడు కొట్టుమిట్టాడుతున్నారు. గతేడాది మాదిరిగానే ఉపాధ్యాయులను డిప్యూటేషన్ ద్వారా సర్దుబాటు చేయాలని, విద్యావాలంటీర్లను రిక్రూట్ చేసి విద్యా వ్యవస్థను గాడిన పెట్టేలా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం : రెహ్మాన్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం
జయ్యారంలోని ప్రాథమిక పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఉపాధ్యాయులు లేని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఒక్క ఉపాధ్యాయుడితోనే పాఠశాల నడిపించాల్సి రావడం చాలా ఇబ్బంది. ప్రభుత్వం, జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించాల్సి ఉంది. మండలంలోని జయ్యారం మాత్రమే కాకుండా మంగోళిగూడెం, విస్సంపల్లి, దేవోజీతండాలోనూ ఏకోపాధ్యాయులే పాఠశాలలను నడిపిస్తున్నారు.
పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నాం : జెట్టి రాములు, స్కూల్ విద్యా కమిటీ చైర్మెన్
పాఠశాలను ప్రతిరోజు గ్రామ పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నాం. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంతోపాటు ఐదుగురు ఉపాధ్యాయులను, స్కావెంజర్ను నియమించాల్సి ఉంది. ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయ, ఇతర ఉద్యోగ ఖాళీలను కనీసం డిప్యూటేషన్ ప్రాతిపదికపైనైనా భర్తీ చేయాలి.