Authorization
Mon Jan 19, 2015 06:51 pm
27న భారత్‌బంద్‌ను జయప్రదం చేయండి
సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా
కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-ఐనవోలు
కేంద్రం ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న నిర్వహించే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో గుండెకారీ మహేందర్ అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్, ప్రయివేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాసేలా నాలుగు కోడ్లను తీసుకొచ్చిందని మండిపడ్డారు. కరోనాతో ఒకవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న నిర్వహించే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ ప్రభాకర్ రెడ్డి, మండల కార్యదర్శి కాడ బోయిన లింగయ్య, నారాయణ రెడ్డి, రాం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ- నెక్కొండ రూరల్
ఈ నెల 27న నిర్వహించే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ నగర్లో పార్టీ మండల కార్యదర్శి ఈదునూరి వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధానాలకు, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల కు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, వ్యాపార వర్గాలు భారత్ బంద్ కు మద్దతు పలికి విజయవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో సామాన్యుడిపై పెను భారం పడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు భూక్య సమ్మయ్య, మండల కమిటీ సభ్యులు ఎండి ఇబ్రహీం, లింగాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.