Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వెంకట్రామ్రెడ్డి
ఘనంగా జేవీవీ నాల్గవ మహాసభలు
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
శాస్త్ర విజ్ఞాన ఫలాలు సామాన్యులకు అందాలంటే బోధన, పరిశోధన ద్వారా వైజ్ఞానిక వైఖరులు, శాస్త్రీయ స్పృహ, శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలని కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వెంకట్రామ్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలోని వాగ్దేవి విద్యాసంస్థల సెమినార్లో ఆచార్య ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన జేవీవీ నాల్గవ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న రోజుల్లో కత్రిమ మేధ, రోబోటిక్స్ సమాజంలో చాలా మార్పులు తీసుకురాబోతుందన్నారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల వరప్రసాద్ మాట్లాడుతూ.. కోవిడ్ సందర్భంగా జేవీవీ ఆధ్వర్యంలో రాష్ట్రం యావత్తు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలిపారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ.. శాస్త్ర సమాజ నిర్మాణ స్థాపనలో జనవిజ్ఞాన వేదిక కషిని కొనియాడారు.
అనంతరం పర్యావరణ వేత్త ధర్మ ప్రకాష్ రాసిన ''ఎన్విరాన్మెంటల్ ఏకోస్'' అనే పుస్తకాన్ని అతిధులు ఆవిష్కరించారు. తదనంతరం జరిగిన వైజ్ఞానిక సదస్సులో 'ఆధునిక విజ్ఞాన శాస్త్రం- సవాళ్లు' అనే అంశంపై విశ్రాంత ఆచార్యులు రామచంద్రయ్య, 'పర్యావరణ సమస్యలు - పరిష్కారాలు' అనే అంశంపై విశ్రాంత అటవీ శాఖ అధికారి పురుషోత్తంలు మాట్లాడారు. స్కోప్ ప్రాజెక్టు పరిచయం గురించి నిట్ ఆచార్యులు లక్ష్మారెడ్డి, ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో విద్యారంగం - ప్రత్యామ్నాయం అనే అంశంపై నిట్ ఆచార్యులు ఆంజనేయులు ప్రసంగించారు. తదనంతరం జరిగిన ప్రతినిధుల సదస్సులో గత రెండు సంవత్సరాలుగా జిల్లాలో జన విజ్ఞాన వేదిక చేసిన కార్యక్రమాల గురించి సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమాలను నిర్దేశించుకున్నారు. తర్వాత నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నిట్ ఆచార్యులు డాక్టర్ కాశీనాథ్, ప్రధాన కార్యదర్శిగా పరికిపండ్ల వేణు, ఉపాధ్యక్షులుగా డాక్టర్ రాములు, డాక్టర్ రవి కుమార్, భద్రయ్య, ఉమామహేశ్వర్, డాక్టర్ జ్యోతి, ఆచార్య ఆంజనేయులు. కార్యదర్షులుగా డీ శ్రీనివాస్, మురళి కష్ణ, వి. శ్రీనివాస్, వందన, కుమారస్వామి, సోమయ్య సుమతి. సబ్ కమిటీ కన్వీనర్లుగా డాక్టర్ ప్రభాకరచారి, సుమలత, ధర్మ ప్రకాష్, డాక్టర్ అజరు, డాక్టర్ రాగ సుధా, మొగిలి, సునీత, డాక్టర్. శోభారాణిలు ఎన్నికయ్యారు. దేవనూరు ఇనుప రాతి గుట్టను రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించాలని, కాళోజీ కళాక్షేత్రం పనులు వేగవంతం చేయాలని, వరదలను తట్టుకునేలా హనుమకొండ నగరానికి శాశ్వత ప్రాతిపదికన పనులు చేయాలని, కేజీ టు పీజీ విద్య రంగంలో అన్ని స్థాయిలలో బోధన, పర్యవేక్షణ సిబ్బందిని నియమించాలని, స్త్రీలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను నివారణకు పకడ్బందీగా చట్టాలు అమలు చేయాలని, టీవీలు, సినిమాలలో మూఢనమ్మకాలను పెంపొందించే చర్యలను అరికట్టాలని, తదితర తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.