Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రుద్రమదేవి సొసైటీలో వింత పోకడలు
నవతెలంగాణ-జనగామ రూరల్
సంస్థలో జరిగిన నిధుల అవకతవకల్లో విచారణ కోసం ప్రభుత్వం నియమించిన ఆడిటర్‌కు అవసరమైన దస్త్రాలు ఇచ్చారనే కారణంతో చిరుద్యోగికి సంస్థ ప్రతినిధులు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి. సంస్థలో 16 ఏండ్ల అనుభవం ఉన్న ఓ ఉద్యోగి కోట్ల రూపాయల నిధులున్న సంస్థలో రూ.19వేలు పక్కదారి పట్టించారన్న నెపంతో సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించి వేధిస్తున్న సంఘటన జనగామ జిల్లా రుద్రమదేవి మహిళా మ్యాచ్ సొసైటీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...
రుద్రమదేవి మహిళా మ్యాచ్ సొసైటీలో హనుమకొండకు చెందిన కష్టాల కిషోర్ 2005 జూన్ 1న అకౌంటెంట్‌గా జాయిన్ అయ్యారు. 15 ఏండ్లుగా ఎలాంటి ఆరోపణలు లేకుండా విధులు నిర్వహిస్తుండగా రెండేండ్ల క్రితం నిధుల అవకతవకల పట్ల విచారణ కోసం ప్రభుత్వం నియమించిన అధికారికి అయన అవసరమైన పత్రాలు అందజేశారు. దీంతో 2020 ఆగస్టు 27న కిషోర్‌కు రూ.19251 ఆర్థిక అవకతవకలు, అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ అప్పటి సొసైటీ అధ్యక్షురాలు బండి విజయలక్ష్మి సంజాయిషీ నోటీసు ఇచ్చారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, తాను వాడుకున్నట్లు చెబుతున్న డబ్బులు లాకర్లో అదనంగానే ఉన్నాయని ఆడిట్ అధికారులు ఇచ్చిన నివేదికను జత చేస్తూ అదే నెల 29న ఆయన వివరించారు. వివరణ సంతృప్తిగా లేదని పేర్కొంటూ 9మంది సభ్యులతో విచారణ కోసం కమిటీని నియమిస్తూ కిషోర్‌ను ఆగస్టు 31న బదిలీ చేశారు. అనంతరం అక్టోబరు 2న ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ కాలంలో కూడా తన తప్పు లేదంటూ కిషోర్ 14 పర్యాయాలు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. ఆరు నెలల అనంతరం అధ్యక్షురాలికి దరఖాస్తు చేసుకోగా అతన్ని విధులకు తీసుకోవాలంటూ సీఈఓకు ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి లాక్డౌన్ పెట్టే వరకు మూడు నెలల పాటు జూన్ 31 వరకు అటెండెన్స్ రిజిస్టర్లో కిషోర్ సంతకాలు చేశారు. రూ.19,241కి అదనంగా తొమ్మిది వేల ఐదు వందల 81 రూపాయలు పక్కదారి పట్టినట్లు ఆరోపిస్తూ సంస్థ ఏప్రిల్ 20న మరో నోటీసు ఇచ్చింది. అనంతరం సంస్థ నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. 24 ఏప్రిల్ 2001న కిషోర్ జిల్లా సహకార అధికారికి సహకార కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు కిశోర్ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని సస్పెండైన కాలంతో పాటు నేటి వరకు పూర్తి వేతనం చెల్లించి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆగస్టు 26న అధ్యక్షురాలికి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు కూడా సహకార కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని పరిస్థితి.
ఈ విషయమై రుద్రమదేవి మహిళా సొసైటీ ఇప్పటి అధ్యక్షురాలు సిద్ధలక్ష్మీ సంప్రదించగా వెంటనే బోర్డు మీటింగ్ పెట్టి కిషోర్‌ను విధుల్లోకి తీసుకోవాలని తాను సీఈఓ కవితను ఆదేశించానని, అయినప్పటికీ ఆమె నుండి స్పందన రావడం లేదని, బయటనుండి తనపై ఒత్తిడి వస్తుందని చెప్పాగా ఈనెల 28 మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఈవో చెప్పారని తెలపడం గమనార్హం.