Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విపక్షాలు, వ్యాపారస్థుల నిరసన
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
నియోజకవర్గకేంద్రంలో సుమారు కిలోమీటరు రహాదారి మరమ్మత్తు చేయడానికి రెండు సంవత్సరాలు గడుస్తున్నా, పలుమార్లు మంత్రి ఎర్రబెల్లి కాన్వారు అడ్డుకున్నా, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిం దని, తద్వారా ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోకుండా పాలకులు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, ఏఐఎస్ఎఫ్ నాయకులు, వ్యాపారస్థులు అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. రాజయ్య రాజీనామా చేస్తేనే నియోజకవర్గ కేంద్రంలో రహదారులు బాగుప డతాయా అంటూ ప్లకార్డులతో నినదించారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన కారులను అదుపులోకి తీసు కున్నారు. అనంతరం స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ చౌరస్తా నుంచి రైల్వే గేటు వరకు బీటీ రోడ్డు మరమ్మతులు, విస్తరణ పనుల్ని చేయడంలో స్థానిక ఎమ్మెల్యే రాజయ్య పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. నిరసన వ్యక్తం చేసిన ప్పుడల్లా మరమ్మతులు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికి విస్మరిస్తున్నారన్నారు. గతంలో నెలలో పూర్తి చేపిస్తానని, లేదంటే తానే స్వయంగా కుర్చీ వేసుకుని పనులు పూర్తి చేస్తానన్న ఎమ్మెల్యే మాటలు నీటిమూటలయ్యాయన్నారు. సదరు కాంట్రాక్టర్ పై కేసు పెట్టినా ఎవరూ పట్టించుకోవట్లేదన్నారు. పనులు పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని అన్నారు. లేదంటే ఎమ్మెల్యేను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్, సీపీఐ(ఎం) మండల కన్వీనర్ మునిగెల రమేష్,కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి చింత ఎల్లయ్య, మండల అధ్యక్షులు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, ఎఐఎస్ఎఫ్ నాయకులు చింత జగదీష్, సీపీఐ మండల కార్యదర్శి విజరు, మేకల మల్లేశం, నలిమేల ఏలీయా, మార్క శ్రీను, సారంగం, శ్రవణ్, రాజు, రవి పాల్గొన్నారు.