Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేగంగా పడాల్సి ఉండగా పలువురు నేతల దుందుడుకు వైఖరితో నేటికీ కార్యక్రమాలను రూపొందించుకోవడంలో అలసత్వం వహించగా సెప్టెంబర్ 17న హసన్‌పర్తిలో జరపాల్సిన బహిరంగ సభను కూడా గజ్వేల్‌కు మార్చడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో 'కొండా' దంపతుల, 'జంగా' వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తమ వుతోంది. ఒక్కొక్కరు రెండు, మూడు నియోజకవర్గాలను రిజర్వ్ చేసుకునే పద్ధతిలో పావులు కదపడంతో మిగతా నేతలంతా ఒక్కటై హసన్‌పర్తిలో జరగాల్సిన బహి రంగ సభను నిర్వహించడానికి ముందుకు రాక పోవడంతో ఈ సభను గజ్వేల్‌లో నిర్వహిం చారు. పలువురి దుందుడుకు చర్యలతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని సగటు కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మల్కా
జ్గిరి ఎంపీ
రేవంత్‌రెడ్డిని నియమించగా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసి నిర్వహించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఆశలు చిగురించాయి. ఈ దశలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ దిశగా అడుగులు పడకపోవడం గమనార్హం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అడుగులు ముందుకు పడడం లేదు. నేతల మధ్య ఉన్న అనైక్యత, పలువురు నేతల దుందుడుకు చర్యలతో సయోధ్య కరువైంది. సెప్టెంబర్ 17న వర్ధన్నపేట నియోజకవర్గంలో హసన్‌పర్తిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినా నేతల మధ్య అనైక్యతతో ఈ కార్యక్రమాన్ని గజ్వేల్‌కు తరలించి, అక్కడ నిర్వహించడం గమనార్హం. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించని నియోజకవర్గాలున్నాయి. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ములుగు, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పాలకుర్తి, జనగామ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో తప్పా పార్టీ కార్యక్రమాలు మిగతా నియోజకవర్గాల్లో జరిగిన దాఖలాల్లేవు. దీంతో పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
దుందుడుకు చర్యలతో నష్టం..
కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతల దుందుడుకు చర్యలతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. 'కొండా' దంపతులు మూడు నియోజకవర్గాలపై దృష్టిని కేంద్రీకరించడంతో ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావులు ఇటు వరంగల్ తూర్పుతోపాటు అటు పరకాల, భూపాలపల్లి నియోజకవర్గ వ్యవహారాల్లో తలదూర్చడంతో ఆయా నియోజకవర్గ నేతలు 'కొండా' దంపతులపై ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా హుజురాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖను రంగంలోకి దించనున్నట్లు ప్రచారం జరగడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో పలు నియోజకవర్గాలను తమకు కేటాయించాలని ఒప్పందం కుదుర్చుకునే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలు 'కొండా' దంపతులకే అన్ని నియోజకవర్గాలను కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరకాల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో 'కొండా' దంపతులు ఇదే అదునుగా పలు నియోజకవర్గాలపై తమకు కేటాయించే విషయంలో పట్టుపట్టే అవకాశముంది. కొండా సురేఖ రాబోయే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇదే క్రమంలో కొండా దంపతుల కుమార్తె సుస్మితా పటేల్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దింపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పరకాల లేదా భూపాలపల్లి నియోజకవర్గాల్లో ఒకచోట ఆమెకు కేటాయించేలా షరతు పెట్టే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అటో అడుగు.. ఇటో అడుగు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి రెండు నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించారు. గతంలో పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన 'జంగా' తాజాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంపై దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో వరంగల్, హన్మకొండ జిల్లాల డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి 'జంగా'పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గతంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 'జంగా' పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంతో 'నాయిని', 'జంగా'పై ఫిర్యాదు చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో కాజీపేట ప్రాంతంలో 5వ, 6వ డివిజన్లలో 'జంగా'కు బలమైన అనుచరగణం ఉంది. ఈ ప్రాంతంలో ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లను 'జంగా' గెలిపించుకున్నారు. గత ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతిలో కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డి ఓడిపోయారు. పాలకుర్తిలో 'జంగా' తప్పుకుంటే మంత్రి ఎర్రబెల్లికి పోటీగా బలమైన అభ్యర్థి కరువవుతారు. ఇదిలా ఉంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తనకు బలమైన అనుచరగణం ఉండడంతో తాజాగా 'జంగా' అడుగులు పశ్చిమ వైపు పడుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా గురుశిష్యులు కొండా మురళి, జంగా రాఘవరెడ్డి ఒక్కొక్కరు రెండు, మూడు నియోజకవర్గాలపై నజర్ వేయడంతో ఇతర కాంగ్రెస్ నేతలంతా ఒక్కటయ్యారు. దీని పర్యవసానంగానే హసన్‌పర్తిలో ఈనెల 17న నిర్వహించాల్సిన బహిరంగ సభను గజ్వేల్‌కు తరలించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నేతల నడుమ విభేదాల నేపథ్యంలో సభ సక్సెస్ కాదని భావించడం వల్లే సభను గజ్వేల్‌కు తరలించారు. ఏది ఏమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఐక్యతారాగం రాని పక్షంలో పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు.