Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
వందలాది మంది ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ఎవరికీ న్యాయం జరగలేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క ఆందోళన వెలిబుచ్చారు. మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తగూడ మండలంలోని దుర్గారం తండా నుంచి 80 కుటుంబాలు, తాటివారి వేంపల్లి గ్రామం నుంచి 30 కుటుంబాలు, మాసంపల్లి తండా నుంచి 10 కుటుంబాలు ఎమ్మెల్యే సీతక్క సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని చెప్పారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని విమర్శించారు. స్వరాష్ట్రం సిద్ధిస్తే ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని ఆశించినా నిరాశే ఎదురైందని చెప్పారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు, ఉపాధి లభించక వేదనకు గురౌతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ హయంలోనే ప్రజలకు సుపరిపాలన అందిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. మోసపూరిత పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ను తరిమికొట్టాలని సూచించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లా నారాయణరెడ్డి, జెడ్పీటీసీ పుల్సం పుష్పలత, ఎంపీపీ బానోత్ విజయ రూప్సింగ్, వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్య, గంగారం జెడ్పీటీసీ ఈసం రమ సురేష్, గంగారం ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి, సర్పంచ్ మల్లెల రణధీర్, తదితరులు పాల్గొన్నారు.