Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులతో మమేకమై అభివృద్ధిలో వేగం పెంచాడంటూ జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అభినందించారు. ఖమ్మం జిల్లాకు మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయిన సందర్భంగా ఆదర్శ్ సురభిని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఘనంగా సన్మానించారు. ఆత్మీయంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగ్రతి, ఇతర కార్యక్రమాలను విజయవంతం చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆదర్శ్ సురభి మాట్లాడారు. జిల్లాలో కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అనే విధంగా మా బాస్ జిల్లా కలెక్టర్ గా వారు ఏది చెప్తే అది చేయుటకు ఉత్సాహంగా ముందుండి పనులు చేశామన్నారు. తనకు సహకరించారంటూ ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆర్డీఓ రమాదేవి మాట్లాడారు. అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లాకు తొలి లోకల్ బాడీ అదనపు కలెక్టర్గా వచ్చి కొద్ది రోజుల్లోనే జిల్లా యంత్రాంగాన్ని దిశ నిర్దేశం చేయడంలో విశ్లేషణాత్మంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించారని చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య మాట్లాడుతూ అన్ని విషయాల్లోనూ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఏపీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో అనేక కార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చారని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, జెడ్పీ సీఈఓ ప్రసూనారాణి, కలెక్టరేట్ ఏఓ శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.