Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
మండలంలోని బసవరాజుపల్లి సింగరేణి ఓసీ-3 కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి చెన్నూరి రమేష్, ఏఐటీయూసీ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సెంట్రల్ సెక్రటరీ వెంకటేష్ పాల్గొని మాట్లాడారు. మదనపల్లి గ్రామ ఓసిత్రీలో 45 మంది బ్లాస్టింగ్ పరిధిలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. భూనిర్వాసితులకు ఇంట్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు మోసం చేసిందన్నారు. భూమి నమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటున్న వారిని సింగరేణి సంస్థ మోసం చేయడం సరికాదన్నారు. కాంట్రాక్ట్ పనిలో నెలకు కనీసం 10 నుండి 15 వరకు మాత్రమే పనులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ధర్నాలు విరమించమని భీష్మించుకూర్చున్నారు కాగా సింగరేణి అధికారులు తమ సమస్యలు పరిష్కరిస్తామని చర్చలకు పిలిచారు. దీంతో వారు చర్చల్లో పాల్గొని సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాజు సారయ్య, సాంబయ్య, సురేష్, అనిల్ కుమార్, రమేష్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.