Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
కొన్ని నెలలుగా భూపాలపల్లి నియోజకవర్గంలో నెలకొన్న ఉత్కంఠకు ఈనెల 30న తెరపడనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా భూపాలపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో కీలక మలుపు తిరగనుంది. జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు ఈనెల 30న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. దీంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులతోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైతం జోష్‌లో ఉన్నారు. టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన గండ్ర సత్యనారాయణరావుకు రేవంత్‌రెడ్డితో సత్సంబంధాలున్నాయి. తెలంగాణలో టీడీపీ క్షీణ దశకు చేరుకున్న సమయంలో ఆ పార్టీలో ఉత్సాహంతో పని చేసి టీడీఎల్పీగా రేవంత్‌రెడ్డి కొనసాగిన సమయంలోనూ సత్యనారాయణ రాష్ట్రస్థాయిలో కీలకంగా పని చేశారు. తెలంగాణలో టీడీపీ డీలా పడడంతో రేవంత్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు దాదాపు ఒకే సమయంలో బయటకొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా సత్యనారాయణరావు భూపాలపల్లి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి ఆ పార్టీలో చేరారు. అయితే టీఆర్ఎస్లో సిట్టింగులకు సీట్లు కేటాయించడంతో సత్యనారాయణ ఆ విషయాన్ని ముందే గ్రహించి ఆ పార్టీ నుంచి బయటకొచ్చి ఏఐఎఫ్బీ పార్టీ సింహం గుర్తుపై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి విజయం సాధించగా సత్యనారాయణరావు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాజీ స్పీకర్ మధుసూదనాచారి మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
నియోజకవర్గ రాజకీయాల్లో కీలక మలుపు
భూపాలపల్లి నియోజకవర్గంలోని ఘనపురం మండలానికి చెందిన గండ్ర సత్యనారాయణరావు టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మొదట స్వగ్రామమైన బుద్ధారం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం టీడీపీ నుంచి గణపురం జెడ్పీటీసీగా విజయం సాధించాడు. 2014లో బీజేపీ నుంచి, 2019లో ఏఐఎఫ్బీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన భార్య పద్మ గణపురం జెడ్పీటీసీగా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో నిత్యం ప్రజలతో ఉంటూ జిల్లా సమస్యలపై చేసిన పోరాటాలతో అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ 2023లో ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలనే ఉద్ధేశ్యంతో వచ్చిన అవకాశమైనా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. దీంతో రానున్న రోజుల్లో భూపాలపల్లి రాజకీయాల్లో కీలక మలుపు తిరగనుంది.
నిత్యం ప్రజల మధ్య ఉంటూ..
పదవి లేకుండా ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజాపోరాటాలతో నిమగమై చేదోడు వాదోడుగా తనదైన ముద్ర వేసుకున్న గండ్ర సత్యనారాయణరావు చేరికతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రానుందన్న ప్రచారం జాగుతోంది. 35 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో సర్పంచ్ నుంచి జెడ్పీటీసీగా పేదలకు సేవలందిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజాదరణ పొందిన సత్యనారాయణరావు కష్టపడి క్రమంగా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. కొందరు నాయకులు ఆడిన మోసపూరిత ఆటలో మోసపోయినప్పటికీ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యల్లో నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ పదవి లేకున్నా నిత్యం ప్రజాసమస్యలపై మండుటెండను సైతం లెక్క చేయకుండా తాను నమ్మిన ప్రజల కోసం రోడ్లపై బైఠాయించి అధికారుల నిలదీయడం, అన్యాయాన్ని ప్రశ్నించడం వంటి సమస్యలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. రానున్న 2023 సాధారణ ఎన్నికల్లో విజయం సాధిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఇటీవల రేవంత్‌రెడ్డితోపాటు మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో సత్యనారాయణరావు భేటీ కావడం 30న ముహూర్తం ఖరారు చేసుకోవడం కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి అధికార పార్టీలో చేరడంతో అప్పటి నుంచి భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన నాయకత్వం లేక కొంత వెనుకబడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టగానే సత్యనారాయణరావు కాంగ్రెస్‌లో చేరడానికి సుముఖంగా ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు భరోసాను ఇచ్చింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండ స్థానం సంపాదిం చుకున్నా సత్యనారాయణరావు కాంగ్రెస్ ఓటు బ్యాంకు తోడైతే రానున్న రోజుల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరావచ్చు అంటూ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
50 వేల మందితో చేరేందుకు సన్నాహాలు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంగడి మైదానంలో ఈనెల 30న జరగనున్న కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య రానున్నారు. ఈ సమయంలో ఏఐఎఫ్బీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి నియోజకవర్గంలోని 50 వేల మందితో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
బహిరంగ సభను విజయవంతం చేయాలి : గండ్ర సత్యనారాయణరావు
ఈనెల 30న జిల్లా కేంద్రంలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏఐఎఫ్బీ రాష్ట్ర నాయకుడు, కాబోయే కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు కోరారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 35 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో ప్రజల్లో ఉంటూ ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పని చేసినట్టు తెలిపారు. కొందరు నాయకులు నమ్మించి మోసం చేశారని అయినా కూడా అధైర్య పడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఉద్యమిస్తామని అన్నారు. 1200 మంది అమరుల బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతుందని ఆ కుటుంబ పాలన అందించేందుకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. కావున 30న తలపెట్టిన బహిరంగ సభకు ఉద్యోగులు, మేథావులు, కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మెన్ దూడపాక శంకర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బానోత్ సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్, ఎన్ఎస్యూఐ నాయకులు బట్టు కరుణాకర్, ఐఎన్టీయూసీ నాయకులు జోగా బుచ్చయ్య, పసునూరి రాజేందర్‌లతోపాటు ఏఐఎఫ్బీ నాయకులు శ్రీనివాస్, ఎస్ రవి, రవీందర్, బుర్ర కొమురయ్య, సంతోష్, రంజిత్, రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు.