Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెడ్పీ ఫ్లోర్‌లీడర్ మంగళపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తుందని జెడ్పీ ఫ్లోర్‌లీడర్, తొర్రూరు జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని సోమారవపు కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని చౌళ్ల తండా అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ చంద్రకళ ఆధ్వర్యంలో పోషకాహార వారోత్సవాలు గురువారం నిర్వహించారు. సీడీపీఓ హైమావతి, సర్పంచ్ బానోత్ యాకమ్మ కిషన్నాయక్లతో కలిసి గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. ఇంటి వంటకాలకు బదులు పిండి పదార్థాలు, జంక్ ఫుడ్, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటుంటే ప్రొటీన్ల కంటే కార్బోహైడ్రేట్ల వినియోగం అధికమవుతోందని తెలిపారు. ఫలితంగా పిల్లలు అధిక బరువు, స్తూలకాయం లాంటి సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. సమతుల ఆహారం కోసం క్యాలరీలు, మాంస కత్తులతోపాటు సూక్ష్మ పోషకాలైన ఇనుము, విటమిన్ ఏ, డీ, జింక్ వంటి అనుబంధ ఆహారాన్ని అందించాలని సూచించారు. జామ, అరటి, బొప్పాయి, బత్తాయి, దానిమ్మ, ఆపిల్ పండ్లు, కూరగాయలు తీసుకుంటే పోషకాల లభ్యత పెరుగుతుందని చెప్పారు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించి, ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయాలని అన్నారు.ప్రతి వంటిల్లూ పోషకాహారశాలగా రూపుదిద్దుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యానికి స్వచ్ఛ ఆహారమే మూలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏసీడీపీఓ ఇందిరమ్మ, సూపర్వైజర్ యశోధ, అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, సుజాత, సీత, ఉదయశ్రీ, అరుణమ్మ, ఆయాలు శారద, పద్మ, తదితరులు పాల్గొన్నారు.