Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని కేజీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్నె వెంకటమల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని గౌడ కమ్యూనిటీ హాల్లో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కమ్మగాని రమేష్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కుర్ర ఉప్పలయ్యతో కలిసి వెంకటమల్లయ్య హాజరై మాట్లాడారు. వైన్స్, బార్లలో ప్రభుత్వం 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులతో గీత కార్మికులకు ఉపయోగం లేదని తెలిపారు. సభ్యత్వం కలిగిన కార్మికులందరికీ ద్విచక్ర వాహనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాల్లో నీరా, తాటి ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేసి గీత కార్మికులను ఆదుకోవాలని సూచించారు. గీత సొసైటీలకు పదెకరాలు చొప్పున భూమి కేటాయించాలని, హరితహారంలో మొక్కలు నాటాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బండి కొండయ్య, రాజేష్, వెంకటేశ్వర్లు, శ్రీను, సోమయ్య, దేవేంద్ర, యాకయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు.