Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలని జెడ్పీ చైర్పర్సన్ బిందు నాయక్ తెలిపారు. మండలంలోని కంబాలపల్లి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని పోషక విలువలు కలిగిన ఆహార పదార్ధాలు, ఆహార ధాన్యాల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా బిందు మాట్లాడారు. అంగన్వాడీ సెంటర్లకు రేషన్ బియ్యం స్థానికంగా ఇచ్చేలా రేషన్ షాపులు ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులతో మాట్లాడతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ పోషక విలువలు కలిగిన కూరగాయలు ఇంటి పెరటిలోనే పండించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. తద్వారానే ఆరోగ్యవంతమైన, పోషక విలువలు కలిగిన ఆహారం లభించి పిల్లల్లో మెదడు చురుకుదనం పెరిగి ఆరోగ్యవంతమైన పౌర సమాజం తయారు చేసుకోగలమని తెలిపారు. పోషన్ అభియాన్ కార్యక్రమాన్ని ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతినెలా ఒకసారి నిర్వహిస్తే గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లల తల్లులకు సమతుల ఆహారం, ఆరోగ్యం పట్ల అవగాహన కలుగుతుందని చెప్పారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సమతుల ఆహారం అందిస్తే వారు సరైన పోషక విలువలు కలిగి శరీరక, మానసిక ఆరోగ్య వంతులుగా తయారవుతారని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది, గర్భిణులు, పిల్లల తల్లులతో పోషన్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. ఉమ్మడి కంబాలపల్లి క్లస్టర్‌లోని 35 మంది గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు వట్టం లక్ష్మణ్‌రావు, గలిగి వెంకన్న, ఎంపీటీసీలు సనప సోమేష్, బానోత్ మోహన్‌జీ, సీడీపీఓ డెబోరా, ఎంపీఓ పద్మ, అంగన్వాడీ సూపర్వైజర్లు సుగుణ, కావ్య, టీఆర్ఎస్ నాయకులు బానోత్ మంత్రియ, అంగన్వాడీ టీచర్ కోరం చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.