Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్వరలో రేవంత్ గూటికి చేరనున్న కీలక నేత?
నవతెలంగాణ-గార్ల
ఎట్టకేలకు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడి ఎంపిక ముగిసింది. ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్య కర్తలతో సమావేశం ఏర్పాటు చేసి అ పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జి తాతా మధు సమక్షంలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ అధ్యక్ష్య, కార్యదర్శులను ప్రకటించారు. అధ్యక్ష పదవికి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆశావహులు పోటీ పడగా టీడీపీ నుంచి వచ్చిన ఆమె అనుచరుడు, రాజకీయ ఓనమాలు దిద్దిన గంగావత్ లక్ష్మణ్ నాయక్‌ను ఎమ్మెల్యే ఎంపిక చేశారు. ప్రస్తుత అధ్యక్షుడికి టీడీపీ మండల అధ్యక్షుడుగా, మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా పని చేసిన అనుభవం ఉన్నప్పటికీ మండలంలోని నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను సమన్వయం చేయడం కత్తి మీద సాముగానే చెప్పవచ్చు. పార్టీకి చెందిన సంస్థాగత ఎన్నికల్లో దాదాపు టీడీపీ నుంచి వలస వచ్చిన వారికే అధికంగా పదవులు ఇచ్చారని అ పార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నారు. మలిదశ ఉద్యమంలో పోరాడిన కొందరు నాయకులు పదవులు దక్కక అసహనం వ్యక్తం చేస్తుండగా మాజీ ఎమ్మెల్యే కొరం కనకయ్య వర్గంతోపాటు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారిని సమన్వయం చేసి ఏకతాటిపైకి తీసుకురావడం పదవులు, ఇతర అంశాల్లో అసంతప్తిగా ఉన్న వీరందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి గులాబీ తమ్ముళ్లకు మండల అధ్యక్షుడు 'లక్ష్మణ' రేఖ గీచేనా? అనే సందేహం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమౌతోంది.
త్వరలో రేవంత్ గూటికి చేరనున్న ఓ ప్రజాప్రతినిధి?
మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి, అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగిన కీలక నేత త్వరలోనే అధికార పార్టీ నుంచి అనుచరులతో కలిసి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. టీఆర్ఎస్కు చెందిన సదరు నేత మండలానికి ఎమ్మెల్యేగా గెలిచి మొదటి సారిగా వచ్చిన ఎమ్మెల్యే హరిప్రియకు ఘనస్వాగతం పలికి కొంత కాలంగా ఎమ్మెల్యే హరిప్రియ విధానాలతో విభేదించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల ప్రకటించిన టీఆర్ఎస్ మండల, గ్రామ కమిటీల్లో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకోకుండానే ఏకపక్షంగా కమిటీలను ఎంపిక చేశారని అ పార్టీకి చెందిన శ్రేణులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కమిటీ ఎన్నికల తర్వాత అ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే టీఆర్ఎస్ నుంచి అసంతప్తితో మరి కొందరు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం మండల రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా వివిధ పార్టీలతో సంబంధాలు, రాజకీయ అవగాహన, ప్రత్యేకించి అన్ని వర్గాల ప్రజలతో మమేకమై సంబంధాలు కలిగిన కీలక నేత గులాబీ పార్టీ మీద అసంతప్తితో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే 'గులాబీ పార్టీలో గుబులు' మొదలౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.