Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ ర్యాపిడ్ పరీక్షకు రూ.2 వేలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ నగరంలో ప్రైవేటు ఆసుపత్రులలో రోగ నిర్ధారణ పరీక్షలకు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూల్ చేస్తున్నారు. తాజాగా వరంగల్ నగరంలోని గార్డియన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్‌కు రూ.2 వేలు వసూలు చేయడం గమనార్హం. ర్యాపిడ్ టెస్టుకు రూ.500 మాత్రమే తీసు కోవాల్సి వుండగా, దీనికి భిన్నంగా గార్డియన్ ఆసుపత్రి యాజమాన్యం వ్యవహరించడం విస్మయాన్ని కలిగిస్తుంది. ఈ వ్యవహారంపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు సైతం దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలోనే ఇలా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే, ఇక ఇతర ఆసుపత్రులలో, ల్యాబ్‌లలో ఎలా వుంటుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. కోవిడ్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లలో ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వున్నాయి. సంబంధిత అధికారులు వీటిపై నిఘా పెట్టకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌ల యాజమాన్యాలు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చి వైద్య, ఆరోగ్య శాఖాధికారులను వెంటనే రంగంలోకి దింపి ఈ అక్రమ వసూళ్లపై విచారణ చేసి సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.