Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఆర్ఎస్ను విమర్శిస్తే పుట్టగతులుండవ్
అ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
నవతెలంగాణ-రఘునాథపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్నదని, స్వామినాధన్ కమిటీ సిఫార్సు మేరకు రైతులకు న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆరోపించారు. సోమవారం రఘునాథ్‌పల్లి మండలం వెల్దిగ్రామంలో సీనియర్ ఉద్యమనేత పెళ్లి మల్లారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. నల్లధనం మొత్తం వెలికి తీసి పేదలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తామని చెప్పి దాదాపు ఏడేండ్లు పూర్తవుతున్నా చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు కులం, మతం పేరుతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, కాజీపేట రైల్వే కోచ్ ఏర్పాటు చేయాలని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన దొడ్డు వడ్లను కొనుగోలు చేయడం లేదని, దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు లేఖ రాయాలని కోరారు. 2023 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు, మాజీ జెడ్పీటీసీ మారుజోడు రాంబాబు, మాజీ ఎంపీపీ దాసరి అనిత, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శారద, వైస్ ఎంపీపీ మాజీ మల్కాపురం లక్ష్మణ్ గౌడ్, పెళ్లి మల్లారెడ్డి, రమేష్, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు.