Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు నిరంతరం అప్ర మత్తంగా ఉంటూ, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగ కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. సోమవారం జనగామ మండలం చిటకోడూర్ వాగు, రిజర్వాయర్, లింగాలఘనపూర్ మండలం కుందారం వాగులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. వాగుల వద్ద నిరంతర నిఘా ఉండాలని, వాహనాలు, పాదాచారులు వెళ్ళకుండా రహ దారిని మూసి, ప్రత్యామ్నాయ దారుల గుండా ప్రజలు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలన్నారు. 0.3 సామర్థ్యమున్న చిటకోడూర్ రిజర్వాయర్ నిండుగా ఉందన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా 250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుస్తున్నట్లు తెలిపారు. చిటకోడూర్, కుందారం రవాణా వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటు న్నట్టు తెలిపారు. జర్వాయర్ నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. వర్షాల వల్ల వాగులు, చెరువులు, నదులు పొంగే ఆస్కారమున్నందున మారుమూల ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను నీటివద్దకు వెళ్లకుండా గ్రామాల్లో డప్పుచాటింపు చేయించాలని అన్నారు. గ్రామస్థాయి అధికారులు ఆయా ప్రాంతాల్లో ఉండి ప్రజలు ఎవరు నీటి ప్రవాహం వైపు వెళ్లకుండా చూడాలన్నారు. తక్కువ ఎత్తుగల కల్వర్ట్లు, బ్రిడ్జిల సమీపంలోకి ఎవరు వెళ్లకుండా స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు తెలియజేయాలని, బాధ్యత గల సిబ్బందిని కాపలాగా ఉంచాలన్నారు. వర్ష పరిస్థితిపై నివేదికలు సమర్పించాలన్నారు. గతంలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా, మండల అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా గ్రామాల్లో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. అనంతరం లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలోని సర్వే నెంబర్ 464 లో 15.15 ఎకరాలు, 465 లోని 15.32 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అభివృద్ధి పనులకు ఈ భూమి ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ఆయనవెంట అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, జనగామ ఆర్డీవో మధుమోహన్, జనగామ, లింగాల ఘనపూర్ తహసీల్ధార్లు రవీందర్, వీరస్వామి, ఇరిగేషన్ ఏఈ రాజేష్, అధికారులు ఉన్నారు.
జిల్లాలో విస్తారంగా వర్షాలు
జనగామ జిల్లావ్యాప్తంగా గులాబీ తుఫాను ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు కుంటలు అలుగుపోస్తున్నాయి. జిల్లాలో సోమవారం 10.9 మి.మీ వర్షపాతం నమోదైంది.
లింగాలఘణపురం : తుఫాను ప్రభావంతో రెండు మూడు రోజులు భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, చెరువు లు. కుంటలు నిండి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్య అన్నారు. సోమవారం మండలం లోని జనగామ-పాలకుర్తి ప్రధాన రోడ్డుపై పటేల్ గూడెం కుందారం గ్రామాల మధ్య వాగు వదరనీరు ప్రవాహన్ని పరిశీలించారు. అన్ని శాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసర పరిస్థితి తప్ప బయటకు రావొద్దన్నారు. ఆయనవెంట వెంట ఆర్డీవో మధుమోహన్, ఏసీపీి వైభవ్ గైక్వాడ్, తహసీల్ధార్ వీరస్వామి, ఎస్సై దేవేందర్, ఏఆర్ఐ రాజమల్లు , వీఆర్వోలు, వీఆర్ఏలు ఉన్నారు.