Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
నగర ప్రజలపై బల్దియా తాజాగా రూ.24.21 కోట్ల భారం మోపింది. ఇది 2019లో వచ్చిన నూతన మున్సిపల్ చట్టం ఎఫెక్ట్. అసెస్మెంట్లలో చూపిన ఇంటి నిర్మాణ స్థలం (గజాల్లో) తేడాలున్న ఇండ్ల యజమానులపై బల్దియా 25 రెట్లు పెనాల్టీ వేస్తోంది. 210 గజాల ఇంటిపై రూ.37 వేలు పెనాల్టీ వేశారు. అత్యధికంగా ఓ ఇంటి యజమానిపై రూ.10 లక్షలు ఫైన్ పడింది. సదరు చట్టం వచ్చి రెండేండ్లు గడచినా ప్రజలకు అవగాహన కల్పించకపోవడం, భారీగా పెనాల్టీ వేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఈ నేపథ్యంలో 'నవతెలంగాణ' కథనం..
మహానగర పాలక సంస్థ (బల్దియా) పరిధిలోని కాజీపేట, హన్మకొండ, వరంగల్ నగరాలతోపాటు విలీన గ్రామాల్లో కలిసి మొత్తంగా 2 లక్షలకుపైగా ఇండ్లున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కాగా 2019 నుంచి కొత్తగా ఇప్పటివరకు బల్దియా పరిధిలో 5138 ఇండ్ల కొత్తగా నెంబర్లు కేటాయించారు. ఈ క్రమంలోనే అధికారులు అసెస్మెంట్లలో తేడాలు న్నట్టు గుర్తించి నగర పరిధిలోని 4753 ఇండ్లను తనిఖీ చేశారు. అందులో 2847 ఇండ్ల అసెస్మెంట్లో తప్పుడు సమాచారం ఉందంటూ సదరు ఇండ్ల యజమానులపై మొత్తంగా రూ.24.21 కోట్ల పెనాల్టీ వేశారు. 210 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వ్యక్తి పై రూ.37 వేలు పెనాల్టీ వేశారు. అలాగే అత్యధికంగా ఓ ఇంటి యజమానిపై రూ.10 లక్షలు ఫైన్ వేశారు. ఈ క్రమంలో సుమారు 20 రోజులుగా పలువురు ఇండ్ల యజమానులు బల్దియా ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా 2019లో ఇల్లు కట్టుకున్న వ్యక్తులు 2019, 2020ల్లో పాత లెక్కన పన్ను చెల్లించగా ప్రస్తుతం ఈ ఏడాది పన్ను మీద అసెస్మెంట్లో చూపిన స్థలానికి మించి ఉన్న స్థలానికి పన్ను లెక్కించి దాని మీద 25 రెట్లు ఫైన్ విధిస్తున్నారు. 2019 మున్సిపల్ నూతన చట్టాన్ని అధికారులు ఈనెల నుంచి అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇండ్ల స్థలాల్లో (అసెస్మెంట్లలో) వ్యత్యాసముందంటూ పలు ఇండ్లను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తూ కొలతలు నిర్వహించి నూతన చట్టం ప్రకారం పెనాల్టీలు వేస్తున్నారు.
అవగాహన కల్పించకుండానే..
2019 నూతన మున్సిపల్ చట్టం అమలు చేయ నున్న విషయమై అధికారులు ముందుగా అవగాహన కల్పించాల్సిందని నగర ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. చట్టం వల్ల పడనున్న భారాలపై ముందస్తుగా అవగా హన కల్పించి అసెస్మెంట్లలో తేడాలను స్వచ్ఛందంగా సవరించుకునేలా అవకాశం కల్పించకుండానే పెనాల్టీ వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టం అమల్లోకి వచ్చి రెండేండ్లు గడచినా తమకు తెలియదంటూ పలువురు బాధితులు 'నవతెలంగాణ' ఎదుట వాపోయారు. అధికారులు నమోదు చేసుకోవడంలోనే పొరపాటు జరిగిందని పలువురు ఇండ్ల యజమానులు అంటుండగా ఇండ్ల యజమానులే తప్పుడు సమాచారమిచ్చారంటూ అధికారులు అంటుండడం గమనార్హం. ఏది ఏమైనా నూతన చట్టం అమలును తాత్కాలికంగా నిలిపేసి అసెస్మెంట్లలో ఉన్న తేడాలను సవరించుకునే అవకాశం కల్పించాలని నగర జనం కోరుతున్నారు.
పెనాల్టీ చెల్లించాల్సిందే.. : శాంతికుమార్, పన్నుల అధికారి
2019 నూతన మున్సిపల్ చట్టం ప్రకారం అసెస్మెంట్లలో తేడాలున్న ఇండ్ల యజమానులు పెనాల్టీ చెల్లించాల్సిందే. అసెస్మెంట్ చేయించిన సమయంలో నమోదు చేయించిన ప్లింత్ ఏరియాకు (నిర్మాణ స్థలం) మించి ఉన్న ఇండ్ల యజమానులకు మాత్రమే ఫైన్ పడుతుంది. పెనాల్టీదారులందరూ చెల్లించాల్సిందే. ఏకకాలంలో చెల్లించలేని వారికి విడతల్లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తాం.