Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
తమను పంటను దళారి గొలుసుల కుమార్ మాయమాటలు చెప్పి దోచుకున్నాడని కాట్రపల్లి రైతులు మంగళవారం వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు విలేకర్ల సమావేశంలో బాధిత రైతులు మాట్లాడారు. దళారి కుమార్ పండించిన పంటను తనకు విక్రయిస్తే గిట్టుబాటు ధర కల్పిస్తాననడంతో రూ.లు 14లక్షలు విలువచేసే వడ్లు, పత్తి, మొక్కజొన్న పంటలను ఇచ్చినట్లు తెలిపారు. నెలలు గడుస్తున్నా పైసలు ఇవ్వవడం లేదని, పైగా పైసలు అడిగితే దుర్భాషలాడుతూ మానసికంగా ఇబ్బందికి గురి చేస్తున్నాడని వాపోయారు. తదుపరి పలుమార్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రెండు నెలల్లో పైసలు ఇస్తానని ప్రామిసరీ పత్రం రాసి చెక్కులు ఇచ్చినట్లు వివరించారు. అయితే చెక్కులు కూడా బౌన్స్ అవ్వడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలం తర్వాత గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో డబ్బులు ఇచ్చేంతవరకు తన వ్యవసాయ పొలాన్ని సాగు చేసుకోమని బహిరంగంగా చెప్పడంతో సాగు చేసుకుంటున్నామని తెలిపారు. చెమట చిందించనిదేే పూట గడవని తమను కుమార్ కోర్టు, మానవ హక్కుల సంఘం నోటీసులు, ఫిర్యాదులు అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారిని వేడుకుంటున్నారు. సమావేశంలో బాధిత రైతులు అంజయ్య, సోమన్న, యాకయ్య, శ్రీను, అశోక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.