Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ ఆధ్వర్యంలో జీఎంకు సమ్మె నోటీసు
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
73 షెడ్యూల్డ్ పరిశ్రమలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు ధరల కనుగుణంగా పెంచాలని డిమాండ్ చేస్తూ, సమస్యలు పరిష్కరించకుంటే అక్టోబర్ 8న సమ్మెకు దిగుతామని మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఏరియా జనరల్ మేనేజర్‌కు సమ్మె నోటీస్ అందించారు. అనంతరం సీఐటీయూ జయశంకర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొట్ల చక్రపాణి, కంపేటి రాజయ్య మాట్లాడుతూ అక్టోబర్ 8న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మెను సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ,ఔట్ సోర్సింగ్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేటి ధరలకు అనుగుణంగా ఏడెనిమిది సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరగక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల వేతనాలు సవరిస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో ఎంఎస్ 22 గెజిట్‌లో ప్రకటించి పెరిగిన వేతనాలను సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయాలని కోరారు. ప్రమాదం, కోవిడ్‌తో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో వలె 15 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని, ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు దోర్నాల సారయ్య, కోశాధికారి మడికొండ సుధాకర్, నాయకులు నేర్పాలి శ్రీనివాస్, మారేపల్లి మదనమ్మ, దెబ్బట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.