Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చెరువులను తలపిస్తున్న వార్డులు అ సుదరీకరణ పనులు పూర్తి చేయాలి
అ సీపీఐ(ఎం)జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
పట్టణంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయ ని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చొరవ తీసు కొని సుందరీకరణ పనులు పూర్తిచేసి రోడ్లన్నీ బాగు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. మంగళ వారం పట్టణంలోని స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో పి కల్యాణి అధ్యక్షతన పార్టీ పట్టణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లా డారు. జనగామ ప్రాంతం పోరాటాలకు పురిటిగడ్డని అన్నారు. ఆ పోరాటం స్ఫూర్తిని పునికిపుచ్చుకొని జనగామ జిల్లాను సాధించుకున్న ఘన చరిత్ర జనగామ ప్రజలదని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ఉన్నతాధికారులు పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చిత్తశుద్ధితో పని చేయక పోవడంతో అన్ని వార్డులపై వరదలు, బురద ప్రభావం పడిందన్నారు. ఆర్భాటంగా రోడ్ల విస్తరణ పనులు, డివైడర్ల పనులు, చౌరస్తాలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించి పూర్తిచేయడంలో వైఫల్యం చెందారన్నారు. సుందరీకరణ పనులు అడపాదడపా చేస్తూ గాలికొదిలేశారని అన్నారు. కాంట్రాక్టర్ను ఆరా తీస్తే డబ్బులు సక్రమంగా రావడంలేదని పనులు చేయలేకపోతున్నామని చెబుతున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం పనులు ప్రారంభించి రెండేండ్లు దాటినా పూర్తి కాలేదన్నారు. కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని అన్ని వార్డులు ప్రధానంగా కుర్మవాడ మొత్తం నీటితో నిండి పంటపొలాలుగా మారాయన్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే సందర్శించిన దాఖాలాలు లేవని విమర్శించారు. అధికారులు, ఎమ్మెల్యే ప్రణాళిక బద్దంగా చర్యలు చేపట్టకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. జనగామ మున్సిపల్ లో సీపీఐ(ఎం)కౌన్సిలర్లుగా ఉన్న సమయంలో పట్టణంలో అంతర్గత డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని విన్నవిస్తే పెడచెవిన పెట్టారని అన్నారు. ఇబ్బడిముబ్బడిగా ఇంటినిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా పట్టణ విస్తరణ పనులు, శాశ్వత అంతర్గత డ్రైనేజీ వ్యవస్థలు నిర్మించాలన్నారు. లేదంటే మున్సిపల్ కార్యాలయం, ఎమ్మెల్యే ఇంటి ముందు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల శ్రీనివాస్, ఇర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, బొట్ల శేఖర్, పట్టణ నాయకులు జోగు ప్రకాష్, అజారోద్దిన్, బొట్ల శ్రావణ్, లింగం, లలిత, తదితరులు పాల్గొన్నారు.