Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జయప్రదం చేయాలని సీఐటీయూ పిలుపు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కార్మిక వర్గం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అక్టోబర్ 8న చేయనున్న రాష్ట్రవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ హన్మకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్ కార్మికులను కోరారు. గురువారం సీఐటీయూ నేతృత్వంలో జరుగుతున్న 'కార్మికగర్జన' పాదయాత్ర రాంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి చేరింది. ఈ సందర్భంగా రాగుల రమేశ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని 73 షెడ్యూల్డ్ పరిశ్రమల జీవోలను సవరించాలని, కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఐదు రంగాల జీవోలకు గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 ఏండ్లవుతున్నా 73 షెడ్యూల్డ్ పరిశ్రమల జీవోలను సవరణ చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఖజానా నుండి ఉద్యోగులకు, కార్మికులకు, ప్రజాప్రతినిధులకు రెండుసార్లు వేతనాలు పెంచిందన్నారు. ప్రైవేటు పరిశ్రమల యజమానుల నుండి ఇవ్వాల్సిన వేతనాల జీవోలను సవరణ చేయకుండా యజమానుల ఒత్తిడికి టీఆర్ఎస్ ప్రభుత్వం తలవంచి పనిచేస్తోందన్నారు. ఎమ్మెల్యేల వేతనం, ప్రజాప్రతినిధుల వేతనాలను పెంచుకున్న సీఎం కేసీఆర్ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలను పెంచలేదన్నారు. 2009 నుంచి షెడ్యూల్డ్ పరిశ్రమల జీవోలు సవరణ చేయకపోవడంతో కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేసిన ఓపికతో, సహనంతో జీవిస్తున్నారన్నారు. సత్వరమే కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్మిక్రమంలో సీఐటీయూ హన్మకొండ జిల్లా అధ్యక్షులు జి. ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి, మహబూబ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.