Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడల్ మార్కెట్, పార్క్, 'డబుల్' ఇండ్ల పరిశీలన
జిల్లా కలెక్టర్ శశాంక
నవతెలంగాణ-తొర్రూరు
ప్రజల అవసరాలకు తగ్గట్టు అభివద్ధి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు. తొర్రూరు మున్సిపల్ పరిధిలో రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టిన మార్కెట్ యార్డ్, యతిరాజారావు స్మారక పార్కు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను, తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం సందర్శించి పరిశీలించారు. తొలుత పట్టణంలో చేపట్టిన మోడల్ మార్కెట్ పనులను పరిశీలించారు. పట్టణాల విస్తరణ పట్ల అవగాహన పెంచుకోవాలని, భవిష్యత్ తరాలకు సరిపోయేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. అనంతరం యతిరాజారావు స్మారక పార్క్‌ను సందర్శించారు. వాటర్ ఫౌంటెన్ వద్ద నీరు నిల్వ ఉండటాన్ని గమనించిన అసహనం వ్యక్తం చేశారు. నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్వకుండా చూడాలని సూచించారు. త్వరితగతిన ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తదనంతరం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాలను నాణ్యతతో చేపట్టాలని, త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. చివరగా తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డుల గదిని పరిశీలించారు. అక్కడికి వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మున్సిపల్ చైర్మెన్ రామచంద్రయ్య, వైస్ చైర్మెన్ జినుగు సురేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, మున్సిపల్ ఇంజనీర్ రంజిత్, తహసీల్దార్ రాఘవరెడ్డి, రెవెన్యూ ఉద్యోగి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.