Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
గులాబ్ తుఫాన్ మిర్చి రైతులకు కడగండ్లు మిగిల్చింది. 15 రోజులుగా ఏజెన్సీలో మిర్చి మొక్కల కోతలను రైతులు ప్రారంభించారు. మిర్చి పంట సాగుకు మల్చింగ్ షీట్ (కలుపు మొక్కలు పెరగకుండా వేసే ప్లాస్టిక్) కాగితం, డ్రీప్ పైప్‌లను వేలాది రూపాయల ఖర్చు చేసి రైతులు ఏర్పాటు చేసుకున్నారు. మొక్కలు నాటామనుకుని సంతోషిస్తున్న రైతుల పాలిట ప్రకృతి మరోమారు దెబ్బ కొట్టింది. వారం రోజులుగా గులాబ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు తోడు, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు నిండటంటో ప్రాజెక్టు గేట్లను తెరసీ నీరు విడుదల చేస్తున్నారు. దాంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాల మిర్చి పంటలు నీటమునిగాయి.
ఎకరానికి 30 నష్టం రైతుల ఆవేదన
గులాబ్ తుఫాన్ కారణంగా మిర్చి పంట ప్రాంభంలోనే ఎకరాకు రూ.30 వేలు నష్టం వాటిల్లిందని మండలంలోని బోదాపురం పంచాయతీకి చెందిన రైతులు ఈశ్వరరావు, సుధాకర్, పోతురాజు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నదీ సమీపంలోని లంకల్లో 10 ఎకరాల్లో మిర్చి మొక్కలు నాటారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు గోదావరి వరదలు రావడంతో మిర్చి పంటకు ఏర్పాటు చేసిన మల్చింగ్ షీట్లు పనికి రాకుండా పోయాయి. నీరు పెట్టేందుకు అమర్చిన డ్రీప్ కొట్టుకుపోయింది. ఇప్పటివరకు సుమారు రూ.30 వేలు ఖర్చు చేశామని, ఆదిలోనే గులాబ్ తుఫాను కోలుకోలేని దెబ్బతీసిందని రైతులు వాపోయారు.