Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మత్స్య రంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్‌దే
మాధన్నపేట పెద్ద చెరువులో చేపపిల్లను వేసిన ఎమ్మెల్యే పెద్ది
నవతెలంగాణ-నర్సంపేట
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో చేపట్టిన చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారుల జీవితాలలో వెలుగు నింపుతోందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువులో ఆదివారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో లక్షా 37వేల చేప పిల్లలను వొదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం వృత్తిపై ఆధారపడిన కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వృత్తిపై ఆధారపడిన వారి జీవన మనుగడ ప్రశ్నర్థకంగా ఉండేదని, నేడు ఆ పరిస్థితి పోయి సగౌరవంగా బ్రతికే రోజులొచ్చాయన్నారు. వరంగల్ జిల్లా బ్యాంకర్ల సమావేశంలో ఫిషరీస్ డిపార్టుమెంట్ అధికారికంగా ఇప్పటికే 6,600 మంది పైచిలుకు సభ్యులు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. కొత్త సభ్యత్వాలను జిల్లా స్థాయి కమిటీలు మాత్రమే ఇస్తాయని, పాలక వర్గం ఒప్పుకుంటే కొత్త సభ్యత్వాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. మత్స్యకార రైతులకు కేసీసీ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సెంటు భూమి లేని మత్స్యకారులు రూ.50వేల రుణ సదుపాయం కల్పించిందని, తద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా చేపల పెంచుకోవడానికి ఉచితంగా వెసులుబాటు కల్పించిందన్నారు. కేసీఆర్ దూర దృష్టితో ఆలోచించి ప్రాజెక్టులను నిర్మించడంతో ప్రతి ఎకకారాకు సాగు నీరు చేరుకొని పచ్చటి పొలాలతో తెలంగాణ రాష్ట్రం కలకలాడుతోందన్నారు. నేడు తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా, ధాన్యపు భాండాగారంగా భాసిల్లుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన ధాన్యాపు సిరులు, మత్స్య సంపద కళ్ల ముందు కనబడుతుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. దిగుమతి చేసుకునే స్థాయి నుంచి చేపలను ఉత్తర భారతంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, ఎంపీపీ మోతె కలమ్మ పద్మనాభరెడ్డి, జెడ్పీటీసీ కోమండ్ల జయమ్మ జైపాల్ రెడ్డి, సర్పంచ్ మొగులూరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.