Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలని ఎస్సై బండారి రాజు అన్నారు. బుధవారం స్థానిక పోలీసు స్టేషన్లో 'మేము ఆచరిస్తున్నాం.. మీరు పాటింండి' అనే నినాదంతో హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాదారులు హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. రాంగ్ రూట్లో వెళ్ళేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారని వాపోయారు. యువతలో మార్పు వస్తే గానీ ఈ ప్రమాదాలను ఆరికట్టలేమని అభిప్రాయపడ్డారు. రోడ్డు నిబంధనలు పాటించే విధంగా ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజునే ప్రమాదాలు తగ్గించగలమని వ్యాఖ్యానించారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాల బారిన పడే అవకాశాలుంటాయన్నారు. అందువలన ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదన్నారు. ద్విచక్ర వాహనం బయటకు తీసేటప్పడు హెల్మెట్ ధరించాలని, తర్వాతనే వాహనాన్ని నడపాలని, కొద్ది దూరమే కదా అని నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ప్రమాదాలు నివారించే దిశగా యువత తమవంతు సామాజిక బాధ్యత వహించి రోడ్డు నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. అప్పుడే ప్రమాదాలు సంఖ్య గణనీయంగా తగ్గించగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్, శ్రీనివాస్, బొట్ల రాజు, రమేష్, హర్షిత రెడ్డి, రమేష్, అన్వేష్, లక్ష్మణ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.