Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
షెడ్యూల్డ్ ప్రాంతంలోని అదివాసీల హక్కులు చట్టాల అమలు కోసం దశల వారీగా ఆందోళన చేయడానికి అదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి సంసిద్ధం కావాలని తుడుందెబ్బ రాష్ట్ర సంస్కతిక కార్యదర్శి ఆగబోయిన రవి పిలుపునిచ్చారు. బుధవారం మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో జిల్లా అధ్యక్షులు ఆలూరి రాజు అధ్యక్షతన తుడుందెబ్బ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీల సమష్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడం కోసం అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్న క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆదివాసీల హక్కుల గురించి మాట్లాడకుండా అక్రమ చొరబాటు దారులకు హక్కులు కల్పించాలని కుట్ర పూరితంగా మాట్లాడడం సరికాదన్నారు. ఆదివాసీల మనోభావాలను దెబ్బతీస్తూ చట్టాలను కించపరిచే విధానాలు అవలంభిస్తున్నారని ఆరోపించారు. అఖిల పక్షం ముసుగులో ఆదివాసుల పైన రాజకీయ పార్టీలు దాడి చేస్తున్నాయని అన్నారు. ఆదివాసీల చట్టాల అమలు కోసం పాటు పడని రాజకీయ పార్టీలతో చాలా ప్రమాదాలు ఉన్నాయని, తుడుందెబ్బ అఖిల పక్షం ఇక ఎప్పుడు కలసి పని చేయదని అన్నారు. స్వచ్చందంగా ఆదివాసీ హక్కులు చట్టాల కోసమే పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. ఏజెన్సీలో వివిధ పార్టీలలో కొనసాగుతున్న అక్రమ చొరబాటు దారులు ఆదివాసుల పై కొనసాగిస్తున్న దమనకాండను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయాలని అన్నారు. ఆదివాసీ లను ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్న పాలక వర్గ పార్టీలను ఆదివాసులు నమ్మవద్దని అన్నారు. ఈ సమావేశం లో రాష్ట్ర నాయకులు సిద్దబోయిన సంజీవ, ఏఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంజ నర్సింగరావు, మండల గౌరవ అధ్యక్షులు ధారం వీరాస్వామి, రైతు సంఘం మండల అధ్యక్షులు ధారం సమ్మయ్య,బిజ్జ నర్సయ్య, చిన్న రవి, బంగారి సారంగపాణి ,మోకాళ్ళ రామారావు తదితరులు పాల్గొన్నారు.