Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుమారు రూ. 3 లక్షలకు పైగా నష్టం
నవతెలంగాణ-మరిపెడ
ఓ గిరిజన రైతు సాగు చేసుకున్న మిర్చి తోటను ధ్వంసం చేసిన సంఘటన మరిపెడ మండలం డిఎస్సార్ జెండాలుతండా జీపీ రెవెన్యూ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. డిఎస్సార్ జెండాల్ తండాకు చెందిన బోడా చందు, చావలి రైతు దంపతులు మూడు ఎకరాల మిర్చి తోటను సాగు చేశారు. ఏపుగా పెరిగిన మూడు నెలల తోటను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తోటలోని సుమారు 300 మిర్చి మొక్కలను పీకేశారు. వ్యవసాయ బావి వద్ద తాగు నీటి క్యాన్లో పురుగు మందు కలిపి బాధిత రైతు కుటుంబాన్ని హత్య చేయాలని పన్నాగం పన్నారు. గుర్తుతెలియని దుండగులు చేసిన దుశ్చర్యకు రూ. 3 లక్షలు నష్టం వాటిల్లే దుస్థితి నెలకొందని బాధితులు బోరున విలపిస్తున్నారు. దుండగులను గుర్తించి చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధిత రైతు కుటుంబం కోరింది. లేదంటే పురుగుల మందు తాగి తామే ఆత్మహత్య చేసుకుంటామని భాదితులు వాపోయారు.