Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మామ పరారీ..
పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు
తెరవెనుక టీఆర్ఎస్ పెద్దలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
గ్రేటర్ వరంగల్ నగరంలోని 24వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆకుతోట శిరీష్ ఒక యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ పంపగా, అదే కేసులో నిందితుడిగా వున్న కార్పొరేటర్ మామ ఆకుతోట సుధాకర్‌ను ఇప్పటి వరకు వరంగల్ పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'ఫ్రెండ్లీ పోలీసింగ్' అంటూ నినాదాలిచ్చే అధికారులు ఈ కేసులో నిందితుడిగా వున్న లిక్కర్ డాన్‌ను అరెస్ట్ చేయకపోవడం వెనుక అధికార టిఆర్ఎస్ పెద్దలు, ప్రజాప్రతినిధుల హస్తమున్నట్లు ప్రచారం జరుగుతుంది. టిఆర్ఎస్ పాలనలో మహిళల పట్ల వివక్షకు ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు. అధికార టిఆర్ఎస్కు చెందిన 24వ డివిజన్ మహిళా కార్పొరేటర్ ఈ సం ఘటన నాటి నుండి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేకుండాపోయింది. మిల్స్ కాలనీ పరిధిలో యువతిని మోసం చేసిన కేసులో ఆకుతోట శిరీష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపగా, అదే కేసులో నిందితుడిగా వున్న మహిళా కార్పొరేటర్ మామ ఆకుతోట సుధాకర్‌ను అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఈ విషయంలో బాధితురాలు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడంలో మిల్స్ కాలనీ పోలీసులు తీవ్ర జాప్యం చేసిన విషయం విదితమే. నిందితుడు లిక్కర్డాన్కు అధికార టిఆర్ఎస్ పెద్దలతో పాటు, ప్రజాప్రతినిధులతో దగ్గరి సంబంధాలుండడమే దీనికి కారణంగా ప్రచారం జరుగుతుంది.
యువతిని మోసం చేసి అత్యాచారం చేసిన కేసులో గ్రేటర్ వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్ మహిళా కార్పొరేటర్ భర్త ఆకుతోట శిరీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసు అధికారులు 15 గడిచినా మరో నిందితుడు కార్పొరేటర్ మామ ఆకుతోట సుధాకర్‌ను అరెస్ట్ చేయక పోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఆకుతోట సుధాకర్‌ను కాపాడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. సంఘటన జరిగిన వెంటనే బాధితురాలు
ఫిర్యాదు చేసినా, కేసు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఇదిలావుంటే నిందితులను పట్టుకోవడంలోనూ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తుండడంతో తెర వెనుక భారీగా ముడుపులు అందాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నేరస్తులతోనే 'ఫ్రెండ్లీ'నా..?
వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో చాలా ఏండ్లుగా 'ఫ్రెండ్లీ పోలీసింగ్' అనే నినాదం వినిపిస్తుంది. తాజాగా జరిగిన సంఘటన నేపథ్యంలో నేరస్తులతోనే ఫ్రెండ్లీ పోలీసింగా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో బాధితురాలిని మోసం చేసిన ఆకుతోట శిరీష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆ యువతిని బెదిరింపులకు గురిచేసిన శిరీష్ తండ్రి ఆకుతోట సుధాకర్‌ను అరెస్ట్ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు ? అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. లిక్కర్‌డాన్‌గా గుర్తింపు పొందిన ఆకుతోట సుధాకర్‌కు అధికార టిఆర్ఎస్ పెద్దలు, ప్రజాప్రతినిధులలో సన్నిహిత సంబంధాలుండడంతో ఆయన్ను అరెస్ట్ చేయడంలో వీరంతా అడ్డుపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
పోలీసులపై తీవ్ర ఒత్తిడి
ఈ కేసులో మరో నిందితుడైన ఆకుతోట సుధాకర్‌ను అరెస్ట్ చేయకుండా అధికార టిఆర్ఎస్కు చెందిన ఒక ప్రముఖ ప్రజాప్రతినిధితోపాటు, మరో ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 24 గంటల్లో కేసును చేదించి అరెస్ట్ చేసే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఈ కేసులో 15 రోజలు గడిచినా అరెస్ట్ చేయకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చట్టానికి చుట్టం..
డబ్బున్నోళ్లు చట్టానికి చుట్టాలుగా మారారు. ఈ కేసులో ఇదే పరిస్థితి స్పష్టమవుతుంది. లిక్కర్ డాన్ సంపన్నుడు కావడంతో ఆయన్ను కాపాడడానికి అధికార టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రెక్కలు కట్టుకోని వాలినట్టు ప్రచారం జరుగుతుంది. ఆ యువతిని మోసం చేసిన విషయంలో కొడుకు ఆకుతోట శిరీష్‌కు తండ్రి సుధాకర్ పూర్తిగా సహకరించడమే కాకుండా, బెదిరింపులకు దిగడం గమనార్హం. బాధితురాలిని పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. బాధితురాలు ధైర్యం చేసి మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిందితులు పోలీసులపై అధికార టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ సంఘటన మీడియాకు లీక్ కావడంతో వార్తలు ప్రచురితమయ్యాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో కేసు నమోదు చేసి ఆకుతోట శిరీష్‌ను మాత్రమే అరెస్ట్ చేసి మరో నిందితుడు ఆకుతోట సుధాకర్‌కు వెసులుబాటు కల్పించారు.
ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు..
లిక్కర్‌డాన్ ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ఆకుతోట సుధాకర్‌ను అరెస్ట్ చేయకుండా అధికార టిఆర్ఎస్ పెద్దలు పోలీసు అధికారులకు అడ్డుపడ్డట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా అతిత్వరలో సుధాకర్ ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. సాధారణ యువతికి న్యాయం చేయడంలో అధికార టిఆర్ఎస్ ప్రజాప్రతి నిధులే అడ్డంకిగా మారడం, నిందితులకు పూర్తి మద్దతునివ్వడం గమనార్హం.