Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోడ్డున పడ్డ కార్మికుల కుటుంబాలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 5వ షెడ్యూల్డ్ ఏరియాలో 1975లో నిర్మితమైన ఏపీ రేయాన్స్ ఫ్యాక్టరీ ఖతమైంది. 1980లో ఉత్పత్తిని ప్రారంభించిన ఈ పరిశ్రమను 'బిల్ట్' కంపెనీ కొనుగోలు చేసింది. అనంతరం ఏటా 90 వేల టన్నుల కాగితపు గుజ్జును ఉత్పత్తి చేయగా, గ్రాసీమ్ కంపెనీ కొనుగోలు చేసేది. అనంతరం గ్రాసిమ్ కంపెనీ సొంతగా కంపెనీని ఏర్పాటు చేసుకోవడంతో 2014 నుంచి 'బిల్ట్' కాగితపు గుజ్జును ఇక్కడి నుంచి కొనుగోళ్లను నిలిపేసింది. దీంతో అదే ఏడాది ఏప్రిల్ 6న బిల్ట్ మూతపడింది. ఈ క్రమంలో 2015 మార్చి 9 నుంచి 2016 మార్చి 6 వరకు కార్మికులు ఏడాదిపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమను పునరుద్ధరించడానికి జీఓఎంఎస్ నెంబర్ 91 జారీ చేసి సబ్సిడీపై పలు రాయితీలు ప్రకటించినా యాజమాన్యం నేటికీ పరిశ్రమను నడపడానికి ముందుకు రాకపోవడం కార్మికుల్లో తీవ్ర ఆవేదనను మిగిల్చింది. ఐడీబీఐ నుంచి యాజమాన్యం తీసుకున్న రూ.5 వేల కోట్ల రుణాన్ని చెల్లించకపోవడంతో యాజమాన్యానికి సదరు బ్యాంకు నోటీసు జారీ చేయడం గమనార్హం. గత సెప్టెంబర్లో పలువురు కార్మికులు కమలాపూర్ నుంచి ప్రగతిభవన్ పాదయాత్ర ప్రారంభించగా, ములుగులో పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్లో ఆజంజాహి మిల్లు మూతపడిన దిశలోనే బిల్ట్ మూతపడడంతో జిల్లాలో పెద్ద పరిశ్రమలు కరువయ్యాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక పెద్ద పరిశ్రమ 'బిల్ట్' పునరుద్ధరణపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడ్డాక పరిశ్రమను పునరుద్ధరించే చర్యలు చేపట్టినా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం గౌతమ్ థాపర్ నేతృత్వంలోని అవంతి బిల్ట్ గ్రూపుతో చర్చించి అనంతరం జరిగిన ఒప్పందం మేరకు పలు సబ్సిడీలను ప్రకటించి జీఓఎంఎస్ నెంబర్ 91ని జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం ఏటా రూ.30 కోట్ల చొప్పున ఏడేండ్లపాటు రూ.210 కోట్లను రాయితీల రూపంగా ఇవ్వడానికి నిర్ణయించింది. అలాగే ఏటా రూ.9 కోట్ల విద్యుత్ సబ్సిడీతోపాటు ఏటా 4 లక్షల మెట్రిక్ టన్నుల నీలగిరి కలపను ఐదేండ్లపాటు అందించడానికి, ఇతర పన్నుల్లో సబ్సిడీ ఇవ్వడానికి అంగీకరించింది. ఈ క్రమంలో యాజమాన్యం పరిశ్రమను నడపడానికి ముందుకు వస్తుందని కార్మికులు భావించినా యాజమాన్యం ముందుకు రాలేదు. దీంతో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
గతం ఘనం
ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపూర్ గ్రామంలో 1975లో ఏపీ రేయాన్స్ పరిశ్రమను స్థాపించింది. 610 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో 1980 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. ఏటా 90 వేల మెట్రిక్ టన్నుల కాగితపు గుజ్జు ఉత్పత్తి అయ్యేది. ఈ కాలంలో పరిశ్రమలో సుమారు వెయ్యి మంది పర్మినెంట్ ఉద్యోగులు, 20 వేల మంది తాత్కాలిక కార్మికులు పని చేసేవారు.