Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని పసరలోని ఆ పార్టీ కార్యాలయంలో అంబాల పోషాలు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని చెప్పారు. నూతన చట్టాలు తెచ్చి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. రానున్న రెండేండ్లలో ఆరు లక్షల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్ముతున్నట్టు తెలిపారు. అలాగే కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరించినట్టు చెప్పారు. దేశ రాజధాని శివారులో రైతులు 10 నెలలుగా ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులపైకి బీజేపీ కార్యకర్తలను ఉసిగొల్పుతోందని ధ్వజమెత్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగాల భర్తీ, పోడు రైతులకు హక్కుపత్రాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు భూపంపిణీ, తదితర అనేక హామీలు ఇచ్చి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి తదనంతరం విస్మరించి మోసపూరిత పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. పోడు భూములకు సంబంధించి అర్హులైన ఆదివాసీ గిరిజనులకు పట్టాలివ్వకపోగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులనే విచక్షణను మరిచి కేసులు బనాయించి జైలు పాల్జేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతం చేయాలని శ్రేణులకు సూచించారు. తద్వారా బలమైన ప్రజాఉద్యమాలు నిర్మించి ప్రజాసమస్యల పరిష్కారానికి బాటలు వేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఐక్యపోరాటాలే శరణ్యమని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి, జిల్లా నాయకులు పొదిల్ల చిట్టిబాబు, మండల కమిటీ సభ్యులు తీగల ఆదిరెడ్డి, గుండు రామస్వామి, గంగదారి స్వరూప, అంబాల సాంబయ్య, వంక నగేష్, క్యాతం సూర్యనారాయణ, సామ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.