Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రానున్నది కాంగ్రెస్ పాలనే
ఉప ఎన్నిక కోసమే దళితబంధు
మాజీ ఎమ్మెల్యే దొంతి
నవతెలంగాణ-పరకాల
ప్రజాస్వామికవాదులు అక్రమాలను, అవినీతిని బయటపెడితే, అధికార పార్టీ నాయకులు వారిపై దాడులు చేస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విమర్శించారు. అధికార పార్టీ నాయకుల విధానాన్ని ప్రజలకు వివరించి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని ఆయన పేర్కొన్నారు. ఆదివారం స్థానిక స్వర్ణగార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దొంతి మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్కు కాలం చెల్లే రోజులు దగ్గరపడ్డాయని, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. అణచివేతతో ప్రభుత్వం ముందుకెళ్లాలని చూస్తోందని, అవినీతి, బంధుప్రీతి, వివక్షతతో పాలనను నడుపుతున్నారన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితుల అకౌంట్లలో డబ్బులు జమచేసినట్లు సెల్‌ఫోన్ మెసేజ్‌లు వస్తున్నాయే తప్ప, అవి వాడుకునేందుకు వీలులేకుండా అకౌంట్లలో డబ్బులను ఫ్రీజింగ్ చేశారన్నారు. పోలీసులను ఆధీనంలో పెట్టుకుని ప్రజాస్వామికవాదులు, ప్రతిపక్షాలపై నిర్బంధ కేసులు పెడుతూ ప్రభుత్వాన్ని నడుపుతు న్నారన్నారు. టీఆర్ఎస్ మోసపూరిత విధానాలను చూసి ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, అందుకోసమే ఎన్నికలు లేకున్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఇనుగాల మాట్లాడుతూ.. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమస్యలను అసెంబ్లీలో చర్చించకుండా.. డుమ్మా కొట్టి హుజురాబాద్‌లో తిరుగుతున్నారన్నారు. నియోజకవర్గంలోని ఆత్మకూరులో అధికారపార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు మోపి 12గంటల్లోనే జైలుకు పంపించారని తెలిపారు. అదే టీఆర్ఎస్ నాయ కులపై కేసులు పెట్టి 24గంటలైనప్పటికీ వారిని కనీసం పోలీసు స్టేషన్‌కు కూడా పిలవలేదని పేర్కొన్నారు. కేసుల పాలైన వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ పంచగిరి జయమ్మ, నర్సక్కపల్లి ఎంపీటీసీ బుర్ర దీప దేవేందర్, పరకాల పీఏసీఎస్ డైరెక్టర్, మాజీ చైర్మన్ కట్కూరి దేవేందర్‌రెడ్డి, కొయ్యడ శ్రీనివాస్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరికలు
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం దొంతి మాధవరెడ్డి, ఇనగాల వెంకట్రాంరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంకటాపూర్ సర్పంచ్ చిలువేరు ఈశ్వరమ్మ టీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరగా దొంతి మాధవరెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా వెల్లంపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు బుర్ర రాజమొగిళి 50మంది నాయకులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.