Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళా సంఘాలతో న్యాయం కోసం బాధితురాలి ఆందోళన
నవతెలంగాణ-హసన్‌పర్తి
కేయూ పోలీసు స్టేషన్ ఎదుట సోమవారం న్యాయం కోసం బాధితురాలు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పలువురిని విస్మయానికి గురిచేసింది. తన 8 సంవత్సరాల కూతురుతో కలిసి పురుగుల మందు సేవించేందుకు యత్నించగా మహిళా పోలీసులకు అడ్డుకుని వారించారు. కూతురు పుట్టిన మూడేండ్ల తరువాత తన భర్త ప్రమోద్‌కుమార్ కువైట్‌లో ఉద్యోగం చేస్తూ ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని, అత్తమామలు నిత్యం వేదింపులకు గురిచేస్తూ నరకయాతన చేస్తున్నారని బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. బాధితురాలు, స్థానికుల కథనం ప్రకారం... పరకాల మున్సిపాలిటికి చెందిన పోశాల విజయ-భిక్షపతి దంపతుల కూతురు సాగరికతో భీమారానికి చెందిన మార్క వనజ-రవీందర్ దంపతుల కుమారుడు ప్రమోద్‌కుమార్‌తో 2012లో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.20 లక్షల కట్నంతో పాటు పెట్టుబోతలు పెట్టి లాంచనంగా వివాహం జరిపించారు. వీరికి 2013లో వేదశ్రీ కూతురు జన్మించింది. మూడు సంవత్సరాల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగింది. మూడేండ్ల తరువాత కువైట్‌లో ఉద్యోగం కోసం వెళ్లిన ప్రమోద్‌కుమార్ భార్య, బిడ్డలను పట్టించుకోవడం మానేశాడు. 2016లో పాస్‌పోర్టుకు దరఖాస్తు కోమని చెప్పి ఇప్పటి వరకు సాగరికను కువైట్‌కు తీసుకెళ్లకపోవడంతో తిరిగి 2018లో భీమారంలోని అత్తగారింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే సాగరిక అత్తమామలు ఎలాగైనా వదిలించుకోవాలన్న ఉద్దేశ్యంతో వరుస దాడులకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురిచేసేవారు. ఈ క్రమంలోనే సాగరిక మహిళా పోలీసు స్టేషన్లో భర్త, అత్తామామలపై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగలేదని మనస్థాపంతో గతంలో సాగరిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో వారి బందువులు నచ్చజెప్పి సాగరికకు ధైర్యం చెప్పారు. పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ భర్త పంచాయతీకి హాజరుకాకపోవడంతో ఇటు పోలీసు స్టేషన్, అటు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 9న వాయుపుత్ర కాలనీలో అత్త వనజ, మామ రవీందర్‌తో పాటు మరికొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి సాగరికతో పాటు అమ్మ విజయ, అమ్మమ్మ నర్సమ్మలను తీవ్రంగా గాయపర్చి 9 తులాల బంగారు ఆభరణాలు, ఒక సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లినట్లు కేయూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేయూ పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. వరుస దాడులతో ఆందోళన చెందిన సాగరిక మహిళా సంఘాల సభ్యులతో సోమవారం కేయూ పోలీసు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సైలు అడ్డుకొని వారించారు. సాగరికను ఓదార్చి తగిన న్యాయం చేస్తామని దోషులకు శిక్షపడేలా చూస్తామని ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఉద్రిక్తంగా మారిన కేయూ పోలీసు స్టేషన్ ఆవరణ ఒక్కసారిగా ప్రశాంతంగా మారింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ జనార్ధన్‌రెడ్డి తెలిపారు.