Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
లఖింపూర్ అమరుల సాక్షిగా రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మల వెంకట్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కోటగడ్డ, పసర, గోవిందరావుపేటల్లో సంఘం ఆధ్వర్యంలో లఖింపూర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళ్లర్పిస్తూ సోమవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడారు. 10 నెలలుగా నష్టదాయక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నష్టదాయక చట్టాలను రద్దు చేయకపోగా రైతులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని విమర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్‌లో కేంద్ర సహాయ మంత్రి అజరు మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా రైతుల మీదుగా కారు నడిపించి నలుగురి ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఘటనను కేంద్రంలోని బీజేపీ కుట్రగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దుర్గార్మంపై భవిష్యత్ మరింత పెద్దఎత్తున రైతాంగ, ప్రజా ఉద్యమాలు తప్పవని వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నష్టదాయక చట్టాలను రద్దు చేయాలని, రైతుల మరణాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, మృతి చెందిన రైతుల కుటుంబాలను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గుండు రామస్వామి, కాప కోటేశ్వర్రావు, పొదిల్ల చిట్టిబాబు, సూర్యనారాయణ, నాగరాజు, ఏనుగు శేఖర్‌రెడ్డి, వేములవాడ సాంబశివరావు, నరహరి, రావి నాగార్జున, తుంగపాటి మధు, కట్ట వెంకటేశ్వర్రావు, తిరుపతిరెడ్డి, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.