Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇటుకాలపెల్లి పంచాయితీ ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సొంత ఇంటి కల సాకారం నెరవేరుతుందని కలలు కన్న పేద ప్రజల ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసిందన్నారు. ఎక్కడో ఓ చోట పది, పదిహేను ఇళ్లు నిర్మించి వాటిని ఏడు సంవత్సరాలుగా చూపిస్తూ ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తూ వచ్చిందన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ఐదు యేండ్ల క్రితం పదిహేను వందల ఇండ్లు మంజూరు అయ్యాయని, గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి పేర్లను ఎంపిక చేసి చేతులు దులుపేసుకొందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో ఏ ఒక్క గ్రామంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. వారం రోజుల క్రితం అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి 1500 వందల ఇళ్లు నిర్మిస్తామని స్వతహాగా నిర్మించుకునే వారికి రూ. 5.50 లక్షలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతకు ముందు కూడా వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పి ఆచరణలో ఖర్చు చేయని ఘనత కేసీఆర్ దక్కుతుందని దుయ్యబట్టారు. మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు వస్తున్నాయనీ, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు దళిత బంధు పేరుతో దళితులను, డబుల్ బెడ్ రూమ్ పేరుతో పేద ప్రజల ఓట్లను కొల్లగొట్టడం కోసమే కేసీఆర్ ఈ హామీలను గుప్పిస్తున్నడన్నారు. ఓట్ల కోసం మాత్రమే ఇలాంటి మోసపూరిత వాగ్ధానాలను పేదలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని గ్రామ సభలు నిర్వహించి అర్హులను గుర్తించాలని, సొంత ఇంటి స్థలం లేని వారికి భూమి కొనుగోలు చేసి ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ నాయకులు బస్ కే మొగిలి పెండ్యాల, సారయ్య,దేశిని రాములు,జన్ను సాంబయ్య, సూరయ్య,అన్వర్ మల్లయ్య,ఉల్లి రావు రాజు, ఆకారపు రఘు, బర్ల ప్రభాకర్, కాటిపాక చేరాలు, తదితరులు పాల్గొన్నారు.
ధర్మసాగర్ : అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు డిమాండ్ చేశారు. సోమవారం వ్యకాస ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట చిలుకా రాఘవులు అధ్యక్షతన దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ అధికారంలోకి వస్తే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడిచినా హామీని అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో లబ్ధిదారులను గుర్తించి, ఇండ్లను ప్రారంభించక పోవడం మూలంగా కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు శిథిలావస్థలోకి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ5.50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, లేని యెడల ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పోడు భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. కూలీల కోసం కూలి బంధు, కూలి బీమా పథకం తేవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు చేస్తున్నవారికి 7 నెలలుగా డబ్బులు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మర్రిపల్లి రమేష్, చింత రాజు, సుంకరి యాదయ్య, ఆరూరి భాగ్య, చిలక రాధా, బోక్క అరుణ, చింత యాధనలక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు.