Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్ర కాలం నుంచి ఆనవాయితీగా..
నవతెలంగాణ-గార్ల
దసరా సందర్భంగా మండల కేంద్రంలో సర్పంచ్ జాతీయ పతాకాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. ఇది దసరా స్పెషల్‌గా చెప్పవచ్చు. స్వాతంత్య్ర కాలం నాటి నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. మత సామరస్యా నికి ప్రతీకగా, జాతీయ భావాన్ని, సమైక్యతను చాటుతూ ఏటా విజయదశమి (దసరా) నాడు మండల కేంద్రం లోని జెండా బజార్‌లోని మసీదు సెంటర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జాతీయ పతాకాన్ని ఎగరేయడాన్ని ప్రత్యేకతగా చెప్ప వచ్చు. నిజాం కాలంలో శాంతిభద్రతల కోసం మసీదు పక్కన పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. ఏటా దసరా నాడు పోలీస్‌స్టేషన్‌లో ఆయుధ పూజ చేసి ఠాణా వెనుక భాగంలోని మైసమ్మ ఆలయం వద్ద మేకపోతును బలి ఇస్తారు. అనంతరం ముస్లిముల సంప్రదాయం ప్రకారం మసీదుకు ఎదురుగా ఏర్పాటు చేసిన గద్దెపై నెల వంక ఉన్న పచ్చజెండాను నవాబు ఎగరేశారు. తదనంతరం జెండా బజార్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో జమ్మి పూజ నిర్వహించేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ప్రజాపాలన ఏర్పడటంతో ఎన్నికలకు ప్రజలు నమాత్తం కావడం నైజాం కాలం నుంచి ఉన్న గార్ల పట్టణం మున్సిపాల్టీగా ఉండేది. మొదట 1952లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నాటి ఎన్నికల్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరపున మాటేటి కిషన్‌రావు ఎన్నికయ్యారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మండల కేంద్రంలోరి మసీదు సెంటర్లో ఉన్న జెండా గద్దె వద్ద జెండా ఎగరేసే విషయంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నడుమ ఘర్షణ ఏర్పడటంతో మున్సి పాల్టీ సభ్యులు సమావేశమై ఆనవాయితీని వదులుకోలేక జాతీయ జెండాను చైర్మెన్ ఎగరేయాలని నిర్ణయించారు. అనంతరం తొలిసారిగా 1958లో మాటేటి కిషన్‌రావు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గార్ల పట్టణం కాస్తా మేజర్ గ్రామ పంచాయతీగా రూపు మారడం నాటి నుంచి అనుసరిస్తూ వస్తున్న విధానాలు నేడు గ్రామ పంచాయతీ పాలకులు అవలంభిస్తూ పంచాయితీ ప్రధమ పౌరుడు సర్పంచ్ కావడంతో ఏటా దసరా పండగ నాడు సర్పంచ్ జాతీయ పతాకాన్ని ఎగరేయడం ఆనవాయితీగా వస్తోంది. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ శుక్రవారం నాడు విజయదశమి రోజున మేజర్ సర్పంచ్ అజ్మీర బన్సీలాల్ మువ్వన్నెల జెండాను ఎగరేయనున్నారు. అనంతరం రాష్ట్ర పక్షి పాల పిట్టను దర్శించుకోనున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు వస్తుండటంతో ప్రత్యేకతను చాటుకుంటుంది.