Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ చౌరస్తా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కుట్రలు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పరకాల ఇన్చార్జి గన్నోజు శ్రీనివాసాచారి, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి ఎండీ రహీంలు అన్నారు. గురువారం నయీంనగర్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నీటి వాడకం జీఓను దగ్దం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను ఈనెల 18నుంచి స్వాధీనం చేసుకోవాలని యాజమాన్య బోర్డు తీర్మానించడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోందన్నారు. గోదావరి నదిపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అప్పగించి రెండు తెలుగు రాష్ట్రాలు తమ జుట్టును కేంద్రం చేతికి అందించాలా అని వారు ప్రశ్నించారు. ఈ బోర్డుల నిర్వహణకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రతి ఏడాది చెరో రూ.200కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ జీఓ ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక్క యూనిట్ కరెంట్ కావాలన్నా, చివరకు తాగటానికి గుక్కెడు మంచినీరు కావాలన్నా కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఈ నిర్ణయం కారణంగా ఏర్పడుతోందని వాపోయారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అధికారాలు మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని నిధులు ఇవ్వకుండా రెండు తెలుగు రాష్ట్రాలను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హనుమకొండ సాంబయ్య, కార్యదర్శులు జీఎల్ శ్రీధర్, నాగవెల్లి సురేష్, చిలువేరు రవీందర్, బైరా పాక ప్రభాకర్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ బర్ల యాకుబ్, వరంగల్ పార్లమెంట్ కార్యాలయం కార్యదర్శి పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.