Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్త యిన క్రమంలో వరంగల్‌లో నవంబర్ 15న విజయగర్జన బహిరంగ సభ నిర్వహించడానికి రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, నన్నపునేని నరేందర్ మామునూరులో స్థలాన్ని గుర్తించారు. త్వరలో ఏర్పాట్లు ప్రారంభిస్తారు. ఈనెల 25న పార్టీ ప్లీనరీలో టీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి కాగానే, విజయగర్జన సభ ఏర్పాట్లను ప్రారంభించే అవకాశముంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ మంత్రులతోపాటు జిల్లాకు చెందిన మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే పార్టీ తరపునరాష్ట్ర కార్యవర్గ నేతలతోపాటు జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, కార్యదర్శులు మెట్టు శ్రీనివాస్, ఎడవెల్లి క్రిష్ణారెడ్డి కూడా సీఎం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ వేశారు. ఆ పార్టీ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ను ఎన్నుకోవడం లాంఛనామే. అనంతరం 20 ఏండ్ల పార్టీ ప్రస్తా నాన్ని విజయగర్జనలో సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు.
టీఆర్ఎస్ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్త యిన నేపథ్యంలో మరోసారి వరంగల్ వేదికగా ఆ పార్టీ నవంబర్ 15న విజయగర్జన బహిరంగ సభను నిర్వహించనుంది. రాష్ట్ర కార్యవర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు రమేష్, నరేందర్ మామునూరులో స్థలాన్ని పరిశీలిం చారు. సభ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కాకుండా నగర శివారులో సభను ఏర్పాటు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని భావించిన నేతలు ఈ మేరకు వరంగల్ నగర శివారులోని మామునూరు ప్రాంతంలోని మైదాన ప్రాంతాన్ని పరిశీలించారు. విజయగర్జన బహిరంగ సభ నిర్వహణకు ఈ స్థలం అత్యంత అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో నేతలు ఈ స్థలాన్ని ఖరారు చేసినట్టేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కీలక బహిరంగసభలు ఇక్కడే..
టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానం నాటి నుంచి నేటి వరకు కీలక బహిరంగ సభలు వరంగల్, కరీంనగర్లలోనే టీఆర్ఎస్ పార్టీ అధికంగా నిర్వహించింది. ఈ ప్రాంతాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలు విజయవంతమవడం పార్టీ శ్రేణుల్లో జోష్‌ను పెంచిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక బహిరంగ సభలను ఈ రెండు జిల్లాల్లోనే అధికంగా నిర్వహించారు. తాజాగా విజయగర్జన సభకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వాదానికి, టీఆర్ఎస్కు ఉమ్మడి వరంగల్ జిల్లా బలమైన పునాదిగా నిలిచిన క్రమంలో ఈ సభ నిర్వహించడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినా వరంగల్ జిల్లానే దానికి మూలంగా ఉండే అవకాశముంది. ఈ క్రమంలో ఈసారి టీఆర్ఎస్ నిర్వహిస్తున్న విజయగర్జన సభ ఆసక్తికరంగా మారింది.
నాటి నుంచి నేటి వరకు..
స్వరాష్ట్ర ఉద్యమంలో భాగంగా వరంగల్ వేదికగా టీఆర్ఎస్ భారీ సభలను నిర్వహిం చింది. మాజీ ప్రధాని దేవెగౌడ, కేంద్ర మాజీ మంత్రులు శరద్‌పవార్, అజిత్‌సింగ్, రాం విలాస్ పాశ్వాన్ హాజరైన విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు చైతన్యవంతు లని సీఎంగా కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ క్రమంలోనే వరంగల్‌ను ఆరు జిల్లాలుగా విభజించి ఈ ప్రాంతాల్లో రాజకీయ సమీకరణలకు బ్రేక్ వేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ బహిరంగ సభ హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాల అనంతరం జరుగనుండడం గమనార్హం. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే ఒకతీరు, ఓడిపోతే మరోతీరు సభ జరిగే అవకాశముంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ బహిరంగ సభకు విజయగర్జన అని నామకరణం చేయడం కూడా చర్చకు దారితీసింది.