Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ఈనెల 21న జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్స్‌లో బ్యాంకుల రుణమేలా నిర్వ హించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. కలెక్టరేట్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని బ్యాంకుల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రజలకు వ్యక్తిగత, గహ నిర్మాణ, వాహన కొనుగోళ్ల, విద్య, పంట, ఇతర రుణాలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, తదితర సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న స్వయం ఉపాధి, మహిళా సంఘాల, తదితర రుణాలపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్టార్టప్ ఇండియా, పీఎంఈజీపీ, స్ట్రీట్ వెండర్స్, ఖాదీ విలేజ్ బోర్డ్, తదితర పథకాల అమలు గురించి ప్రజలను చైతన్యవంతం చేయనున్నట్టు చెప్పారు. అర్హులకు అవకాశాన్ని బట్టి అక్కడికక్కడే రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. రుణ మేళాను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అలాగే అదే రోజు లీలా గార్డెన్స్‌లో సెర్ప్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (డీడీయూజీకేవై) ద్వారా ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించి హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లోని వివిధ ప్రయివేట్, కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేలా 45 నుంచి 90 రోజుల వరకు కంప్యూటర్ ఆపరేటర్, హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, అకౌంటెంట్ తదితరాలతో ఉచిత వసతితో కూడిన శిక్షణకు ఎంపిక చేస్తారని వివరించారు. జిల్లాలోని మిగతా మండలాల యువతకు త్వరలోనే ఏటూరునాగారంలో ప్రత్యేక ఉద్యోగ మేళా ఏర్పాటు చేస్తామని తెలిపారు.