Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ఎన్నికల ప్రధాన
అధికారి శశాంక్ గోయల్
నవతెలంగాణ-గూడూరు
మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలోని సీతానగరం గ్రామ పంచాయతీ పరిధిలోని భీమునిపాదం జలపాతం అద్భుతమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ కొనియాడారు. ఆయన ఆదివారం జలపాతాన్ని సందర్శించి తిలకించారు. తొలుత శశాంక్ గోయల్‌కు జిల్లా కలెక్టర్ శశాంక పూలబోకే అందించి స్వాగతం పలికారు. అనంతరం జలపాతం అందాలను సీఈఓ శశాంక్ గోయల్ ఆస్వాదించి ఆనంద పరవశులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకతి రమణీయతకు అద్దం పట్టేలా ఉన్న భీమునిపాదం జలపాతాన్ని ప్రభుత్వం పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
ఓటర్ నమోదుపై ప్రచారం చేయాలి
మండల ప్రజాప్రతినిధులతో ఎన్నికల సీఈఎ శశాంక్ గోయల్ మాట్లాడారు. ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. నవంబర్ 1 నుంచి ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా చొరవ చూపాలని సూచించారు. ఓటరు పేర్లలో, ఇతరత్రా సవరణలకు కూడా అవకాశం ఉందన్నారు. రికార్డుల్లోంచి మృతుల పేర్లను తొలగించాలని కోరారు.
అధికారులకు సన్మానం
ఎన్నికల సీఈఓ శశాంక్ గోయల్, జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా అటవీ శాఖ అధికారి రవి కిరణ్‌లను సీతానగరం ఎంపీటీసీ దేశిడి రమ మన్మోహన్రెడ్డి, సర్పంచ్ పూజ రమేష్, ఉపసర్పంచ్ తోట వెంకన్న, టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భూక్యా మంగీలాల్, గ్రామ యూత్ కమిటీ అధ్యక్షుడు సమ్మెట శ్రీనాథ్ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శైలజ, సీఐ రాజిరెడ్డి, గూడూరు అటవీ శాఖాధికారి రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.