Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్
నవతెలంగాణ-ములుగు
వరి పంట వద్దని ప్రకటించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల గురించి వెల్లడించడంలో నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అనుబంధ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను వరి పంట వేయొద్దని చెప్పిన క్రమంలో ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు పంపించలేదని తెలిపారు. వరి పంట వేయొద్దని చెబుతున్న క్రమంలో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు కట్టారని ప్రశ్నించారు. గతంలో పత్తి, ప్రస్తుతం వరి వద్దంటున్న ప్రభుత్వం రైతుల పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీడ్ మిల్లర్లు రైతుల నుంచి సేకరించిన రూ.350 కోట్ల విలువైన ధాన్యాన్ని ఏం చేయాలన్నారు. సీడ్ మిల్లర్ల నుంచి పన్నులు వసూలు చేశారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మినుములు, పెసర్లు, కందులు, జనుము, వేరుశనగ, శనగల విత్తనాలు సబ్సిడీకి ఇచ్చినట్టు గుర్తు చేశారు. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం సబ్సిడీ విత్తనాలు ఏమయ్యా యని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలో భూసార పరీక్షలు చేయించారా అన్నారు. రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ పంటల గురించి ఎందుకు చెప్పడం లేదన్నారు. నష్టపోయిన సీడ్ మిల్లర్లకు డబ్బును తిరిగి ఇవ్వాలని, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందో ఖచ్చితమైన అవగాహన ఉంటే అందుకు అనుగుణంగా విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, ఆత్మ డైరెక్టర్ ఆకుతోట చంద్రమౌళి, ఎంపీటీసీ మావూరపు తిరుపతిరెడ్డి, రమణాకార్ తదితరులు పాల్గొన్నారు.