Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
నవతెలంగాణ-బయ్యారం
పాత పోడు భూములను వదులుకోమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మండలంలోని కాచనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గుంపు మొట్లగూడెం గ్రామంలో సుమారు 80 ఆదివాసీ కుటుంబాలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పాయం రమేష్, కొట్టెం రామకష్ణ, తదితరులకు సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామం లో పార్టీ జెండాను ఎమ్మెల్యే సీతక్క, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలోని పోడు భూములను హరితహారం పేరుతో ప్రభుత్వం ఆదివాసీల, గిరిజనుల పొట్టకొడుతోందని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి భజన చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో పోడు భూములపై అధికార పార్టీ మాట్లాడడడం లేదని, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం మైకులు కట్ చేస్తోందని ఆందోళన వెలిబుచ్చారు. కాంగ్రెస్ హయాంలో పోడు భూములకు పట్టాలివ్వగా స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ హరితహారం పేరుతో లాక్కుంటోందని మండిపడ్డారు. ఆదివాసీలు అనేక ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు విద్యుత్, ఇతర సదుపాయాలు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. గోదావరి నీటిని వినియోగించుకోకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. గోదావరి నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. సీతారాం ప్రాజెక్టు నీటిని బయ్యారం చెరువుకు మళ్లిస్తామని హామీ ఇచ్చినా ఆ దిశగా పనులు చేయడంలో ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మండలంలో పార్టీలో చేరిక కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్క ఉదయం బయలు దేరి వచ్చినా పార్టీ శ్రేణులు ఆమెను దారిలో రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదని, ఉదయమే మండలంలోని కొత్తపేట గ్రామానికి వచ్చి కాచనపల్లి దారి తెలియక పోవడంతో బయ్యారం మండల కేంద్రానికి వెనుదిరిగి వెళ్లారు. అక్కడ జిల్లా అధ్యక్షుడు, ఇతర మండల నేతలు ఎంఎల్ఏకు స్వాగతం పలికారు. అందరు కలిసి కాచనపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమంలో పాల్గొని పార్టీ ఆఫీసు ప్రారంబోత్సవం, కొత్తగూడెం గ్రామంలో పార్టి జెండా ఆవిష్కరణ చేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయింది. కార్యక్రమంలో టేకులపల్లి నాయకులు దళ్సింగ్, లక్కినేని సురేందర్, రాంచందర్ నాయక్, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులు బాలునాయక్, ఎంపీటీసీ లక్ష్మీ, మోహన్ నాయక్, ఇల్లందు నియోజకవర్గ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, రవినాయక్, తదితరులు పాల్గొన్నారు.