Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చోద్యం చూస్తున్న అధికారులు,
మూడు పువ్వులు ఆరుకాయాలుగా వ్యాపారం
నవతెలంగాణ-పర్వతగిరి
పచ్చనదంతో కళకళలాడాల్సిన ప్రకతి వనరులు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో కొంతమంది అక్రమార్కులు అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మొరం తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు. యథేచ్ఛగా మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమదందాను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేం అవసరం లేదనట్టు చోద్యం చూస్తున్నారు. వివరాలలోకి వెళితే.. వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం, కొంకపాక శివారులోని ఎస్సారెస్పీ కాల్వ ప్రాంతంలో అక్రమ మొరం దందా సాగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. జేసీబీల సాయంతో మొరం తవ్వకాలు చేపట్టి గ్రామాలలోకి తరలిస్తూ ట్రాక్టర్ ఒక్కింటికి రూ.లు 1000 సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు, అటవీ ప్రాంతాలు, చెరువుల నుంచి మొరం తీయాలంటే తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడ అవేమి లేకుండా అధికారులు నిద్రావస్థలో ఉండటంతో అక్రమార్కుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు మొరం తరలిస్తున్నారు. అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్రామాల్లో అభివద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రజలను మోసం చేస్తూ, మొరం తవ్వుతున్నారు. దీంతో కాలువ బలం రోజురోజుకి తగ్గడంతో పాటు పెద్దఎత్తున అక్రమార్కుల జేబులు నిండుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వెంటనే అక్రమార్కులకు అండగా నిలుస్తున్న మండల అధికారులపై విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు.