Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
రాష్ట్రంలో వరి పంట వేస్తే ఉరి తప్పదంటున్న సీఎం కేసీఆర్ తీరు సరికాదని అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పాయం చిన్నచంద్రన్న అన్నారు. సోమవారం మహబూబాబాద్ కేంద్రంలో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు పూనేం ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. చంద్రన్న పాల్గొని మాట్లాడుతూ లక్షల కోట్లు పెట్టి కాలేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు వరి వేయవద్దు అనటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పత్తి, మిర్చి, పొగాకు తదితర వాణిజ్య పంటలతోరైతు గిట్టుబాటు ధర రాక అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఆహార పంటలు వేయాలని చెబుతూనే వరి వేయద్ధనటం సరికాదన్నారు. నూతన నల్ల సాగు చట్టాల అమలులో భాగంగానే వరి వేయద్దనటం జరుగుతుందన్నారు. మోడీ కేసీఆర్లు దేశ వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ,ఆహార భద్రతను తీవ్ర ప్రమాదం లోకి నెట్టి వేస్తున్నారని అన్నారు. మోడీ తీసుకొస్తున్న దేశద్రోహ కరమైన సంస్కరణలను రైతు కార్మిక వ్యతిరేక విధానాలను తూచా తప్పకుండా రాష్ట్రంలో అమలు చేయటానికి కేసీఆర్ పూను కుంటున్నాడని అన్నారు. నూతన విద్యుత్ సంస్కరణల బిల్లు ప్రకారం రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేయడానికి చూస్తున్నారని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు సేవ చేయటానికి వారి లాభాలను తీసుకురావటానికి మోడీ చేస్తున్న పనులకు కేసీఆర్ వంత పడుతున్నాడని ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోకుంటే ఢిల్లీ తరహా రైతాంగ ఉద్యమాన్ని రాష్ట్రంలో తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముళ్ళకూరి జగ్గన్న, జిల్లా సహాయ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న, ఉమ్మగాని సత్యనారాయణ, జిల్లా నాయకులు జక్కుల యాకయ్య, ఆలకుంట కొమురయ్య ,బొమ్మగాని ఎల్లయ్య, జంపాల మల్లేష్ పూనం బిక్షం, బండపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.